Congress | ఇనుగుర్తి, డిసెంబర్ 11(నమస్తే తెలంగాణ): అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ నేతల ఆధిపత్య పోరుతో జనాలకు అందాల్సిన సేవలు అందకపోవడం, జాప్యం జరగడం చూశాం. కానీ అధికారపార్టీ నేతలు నువ్వా నేనా అనే ధోరణి కారణంగా ప్రజలకు ఎంతటి నష్టం జరుగుతుందో చెప్పడానికి తాజాగా ఓ ఉదాహరణ వెలుగులోకి వచ్చింది. అత్యవసర సమయాల్లో ప్రజలను దవాఖానకు తరలించి, ప్రాణాలను కాపాడేందుకు తోడ్పడే అంబులెన్స్ విషయంలో కూడా కాంగ్రెస్ నేతలు తమ ఆధిపత్య వైఖరిని ప్రదర్శించడం విమర్శలకు తావిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం వారం క్రితం మహబూబాబాద్ జిల్లాకు 7 నూతన అంబులెన్స్‌లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అందులో ఇనుగుర్తి పీహెచ్సీ పేరు ఉండగా రెండో లిస్టులో మాయమైంది. ఇదే విషయాన్ని మహబూబాబాద్ డీఎంహెచ్‌వో మురళీధర్‌ను వివరణ అడుగగా ఇనుగుర్తి పీహెచ్‌సీకి అంబులెన్సును కేటాయించిన మాట వాస్తవమేనని, రెండో లిస్టులో సీరోలు మండలానికి కేటాయించాల్సి వచ్చిందని చెప్పారు. డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్ తన పలుకుబడితో సీరోలు మండలానికి అంబులెన్స్‌ను మంజూరు చేయించుకున్నారని తెలుస్తున్నది. మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రునాయక్ మధ్య ఆధిపత్య పోరుతో ఇనుగుర్తి మండల ప్రజలకు నష్టం వాటిల్లింది. అంబులెన్స్ వంటి కీలక అంశంలోనైనా ఆధిపత్య పోరును పక్కన పెట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
నాడు సదాశయం.. నేడు ఆధిపత్యం
తాను పుట్టిన ఇనుగుర్తికి మంచి చేయాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఎంపీ నిధుల నుంచి రూ.25లక్షలు వెచ్చించి, స్థానిక పీహెచ్‌సీకి అంబులెన్స్‌ను కేటాయించారు. నిరుడు బీఆర్ఎస్ హయాంలో 2023 సెప్టెంబర్ 9న అప్పటి మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వద్దిరాజు కిషన్ ఇనుగుర్తి పీహెచ్సీ ఆవరణలో అంబులెన్స్ సేవలు ప్రారంభించారు. ఈ అంబులెన్స్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం వేరే మండలానికి తరలించింది. అంబులెన్స్ ఉంటే అత్యవసర సమయాల్లో సత్వర వైద్య సేవలు అందుతాయని మండల ప్రజలు చెబుతున్నారు. కానీ కాంగ్రెస్ నేతల ఆధిపత్యపోరుతో మరోసారి అన్యాయం జరిగిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.