హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 37 కార్పొరేషన్ చైర్మన్ల నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను ఇంకా విడుదల చేయలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శనివారం ఆయన గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చాక 17 కులాలకు కార్పొరేషన్లను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. వాస్తవానికి పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు రోజు కాంగ్రెస్ పార్టీ హడావుడిగా చైర్మన్ పదవుల జాబితాను అనధికారికంగా విడుదలచేసిన విషయం విదితమే. దీంతో ఆ జాబితాలో పేర్లున్న నేతలు తమకు పదవులు వచ్చాయని సంబరపడ్డారు. కానీ, ఆ పదవులు ఇప్పటికీ కాగితాలకే పరిమితమయ్యాయి. దీనిపై విలేకర్లు అడిగిన ప్రశ్నలను మంత్రి పొన్నం దాటవేస్తూ ఇంకా జీవో రాలేదని సెలవిచ్చారు. ఆ జీవో ఎప్పుడు వస్తుందో కూడా స్పష్టత ఇవ్వలేదు. బలహీన వర్గాలకు కాంగ్రెస్ హయాంలోనే న్యాయం జరుగుతుందని, విదేశీ విద్యనభ్యసించే బీసీ విద్యార్థులకు సహాయాన్ని పెంచాలని యోచిస్తున్నామని చెప్పారు. అధికారంలోకి వస్తే బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామని ప్రగల్భాలు పలికిన బీజేపీ.. బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తొలగించిందని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు విభజన హామీలను నెరవేర్చలేదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రధాని నరేంద్రమోదీ అవమానించారని మంత్రి పొన్నం ధ్వజమెత్తారు.