హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): ఏండ్లుగా ఎదురుచూస్తున్న నర్సుల కల సాకారమైంది. తమ వృత్తికి, చేస్తున్న సేవకు మరింత గౌరవం తెచ్చేలా ‘ఆఫీసర్’ అని పిలిపించుకోవాలన్న కోరికను రాష్ట్ర ప్రభుత్వం నెరవేరింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానల్లో విధులు నిర్వహిస్తున్న నర్సింగ్ సిబ్బంది హోదాలను ‘ఆఫీసర్లు’గా మార్చింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు శనివారం నుంచే అమలవుతాయని పేర్కొన్నది. వైద్యారోగ్యశాఖతోపాటు, ఇతర శాఖల్లో విధులు నిర్వర్తించే నర్సింగ్ సిబ్బందికీ ఇది వర్తిస్తుందని ఆదేశాల్లో తెలిపింది. తాజా ఉత్తర్వులతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 14 వేల మంది నర్సులకు ప్రయోజనం కలుగనున్నది.
రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు
నర్సుల హోదాను ఉన్నతీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా నర్సులు సంబురాలు చేసుకున్నారు. తమకు సమాజంలో మరింత గౌరవం పెరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌కు, ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావుకు ధన్యవాదాలు తెలిపారు. పీహెచ్‌సీలు స్థాయి నుంచి గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి ప్రధాన దవాఖానల వరకు కేకులు కట్ చేసి, స్వీట్లు పంచుకొని సంబురాలు చేసుకున్నారు. గాంధీ దవాఖానలో నర్సింగ్ ఆఫీసర్లను సూపరింటెండెంట్ రాజారావు సన్మానించారు. నిమ్స్‌లో సీఎం కేసీఆర్‌కు, మంత్రి హరీశ్‌రావుకు ధన్యవాదాలు తెలుపుతూ నిమ్స్ నర్సెస్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఉస్మానియా, నిలోఫర్ దవాఖానల్లోనూ నర్సులు సంబురాలు జరిపారు. ఖైరతాబాద్‌లోని సీహెచ్‌సీలో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. వరంగల్ ఎంజీఎంలో తెలంగాణ గవర్నమెంట్ నర్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు.
సర్కారు దవాఖానలపై నమ్మకాన్ని పెంచండి
ప్రభుత్వ నర్సింగ్ సిబ్బందికి శుభాకాంక్షలు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మీ గౌరవాన్ని మరింత పెంచేలా హోదాలను ఉన్నతీకరిస్తూ ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రేమ, ఆప్యాయతలతో కూడిన వైద్యసేవలు ప్రజలకు అందించి ప్రభుత్వ దవాఖానలపై ఉన్న నమ్మకాన్ని మరింత పెంపొందించాలని ఆకాంక్షిస్తున్నా.
– హరీశ్‌రావు, ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి
ఆరోగ్య తెలంగాణలో భాగమవుతాం
నర్సుల్లో బీఎస్సీ, ఎమ్మెస్సీ వంటి ఉన్నత కోర్సులు, స్పెషలైజేషన్ చేసినవాళ్లున్నారు. ఎంత చదివినా ‘నర్సే’ కదా అనేవారు. ఇప్పుడు ఆఫీసర్ అని మార్చడం వల్ల మా విద్యార్హతలకు తగిన గౌరవం దక్కినట్టుగా భావిస్తున్నాం. మా హోదాలు పెంచిన సీఎం కేసీఆర్‌కు, మంత్రి హరీశ్‌రావుకు ధన్యవాదాలు. ఆరోగ్య తెలంగాణలో భాగమవుతాం.
– శైలజ, నర్సింగ్ ఆఫీసర్, హెచ్‌సీ ఖైరతాబాద్
రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నర్సుల విజ్ఞప్తులను ప్రభుత్వం పరిశీలించి, సానుకూలంగా స్పందించి హోదాను మార్చినందుకు ధన్యవాదాలు. దశాబ్దాల మా కలను సాకారం చేసినందుకు సీఎం కేసీఆర్‌కు, మంత్రి హరీశ్‌రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రభుత్వ నిర్ణయంతో సమాజంలో మా గౌరవం మరింత పెరుగుతుంది. ఇక నుంచి రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం.
– లక్ష్మణ్, నర్సింగ్ ఆఫీసర్, ఎన్‌వోఏ వ్యవస్థాపకుడు
హోదా మార్పుతో గౌరవం పెరుగుతుంది..
నర్సింగ్ ఆఫీసర్ అని చెప్పుకోవడం ఆత్మవిశ్వాసం పెంచుతుంది. ఈ హోదా మార్పుతో గౌరవం కూడా పెరుగుతుంది. తద్వారా రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు వీలు కలుగుతుంది. ఇప్పటివరకు మేం ఎంతసేవ చేసినా చిన్నచూపు చూస్తున్నారనే భావన ఉండేది. ఇప్పుడు మరింత ఉత్సాహంతో పనిచేస్తారు.
– రాజేశ్వరి ముప్పిడి, ట్రెయిన్డ్ నర్సెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు
గత హోదా మారిన హోదా