Ravalkole Land Scam | బాధ్యత మరచి.. బరితెగించి.. రావల్కోల్ భూదందాలో మరో సంచలన బాగోతం వెలుగులోకి!
Ravalkole Land Scam | నాటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రస్తుత మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర మండలం రావల్కోల్ గ్రామ పరిధిలోని సర్వేనెంబరు 4-18, 20, 22, 25ల్లో 275.12 ఎకరాల ప్రభుత్వ భూమిని కొల్లగొట్టేందుకు నంబర్-2 మంత్రి, మరో మంత్రి, ‘ముఖ్యనేత’ బంధువుతోపాటు షాడో సీఎంవో వేసిన భారీ స్కెచ్‌ను కొన్నిరోజుల కిందట ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే.
Ravalkole Land Scam | మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడ్చల్ మండలం రావల్కోల్ గ్రామ పరిధిలో రూ.5 వేల కోట్ల విలువైన 275.12 ఎకరాల భూ దందాలో జరిగింది అక్షరాలా అధికారిక బరితెగింపే ! ఇనామ్‌దారు వారసులంటూ ఓ ఐదుగురు వ్యక్తుల పేరిట భూమిని కొల్లగొట్టేందుకు స్కెచ్ వేసిన ప్రభుత్వ పెద్దలు.. అడుగడుగునా ఉల్లంఘనలకు పాల్పడినట్టు నిన్నటిదాకా తెలిసిన విషయమే. తాజాగా మరో సంచలన బాగోతం తెరపైకి వచ్చింది.
ఇనాం భూములకు ఓఆర్సీలను (ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికెట్స్) జారీ చేయడంలో అత్యంత కీలకమైన తహసీల్దార్ ప్రాథమిక నివేదిక లేకపోగా, ఆర్డీవో ప్రొసీడింగ్స్ జారీ చేసే నాటికి తహసీల్దార్ కనీసం తాజా స్థితిగతులపైనా నివేదిక ఇవ్వకపోవడం గమనార్హం. కానీ ఆర్డీవో మాత్రం తహసీల్దార్ తనకు నివేదిక ఇచ్చారని, అందులో వారసుల కబ్జా, వారసత్వాన్ని ధృవీకరించారని పేర్కొంటూ తప్పుడు సమాచారాన్ని నమోదు చేశారు. ప్రభుత్వ భూమిని కైంకర్యం చేసేందుకు అధికారికంగా ఎంతకు బరితెగించారో దీన్నిబట్టే అర్థమవుతుంది.
ఇటీవల కొందరు గండిపేట పరిధిలో రూ.1,500 కోట్ల విలువైన ప్రభుత్వ భూములకు నకిలీ జీవోలు సృష్టించి రియల్ఎస్టేట్ మార్కెట్లో అమ్మే ప్రయత్నం చేశారు. తహసీల్దార్ ఫిర్యాదుతో పోలీసులు వాళ్లను అరెస్టు చేసి జైలుకు పంపారు. ఇది.. ప్రైవేట్ వ్యక్తుల బాగోతం. మరి, ఆర్డీవో స్థాయి అధికారి తప్పుడు జీవోలు విడుదల చేస్తే? ఇనామ్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా ఉన్న అధికారి, ప్రభుత్వ పెద్దలతో కలిసి తప్పుడు ఉత్తర్వులు సృష్టిస్తే? కిందిస్థాయి అధికారి అయిన తహసీల్దార్ నివేదిక ఇవ్వకున్నా, ఇచ్చినట్లుగా తానే నిర్ధారిస్తే? రూ.5 వేల కోట్ల విలువైన భూములకు సంబంధించి తన ప్రొసీడింగ్స్‌లో తప్పుడు సమాచారాన్ని నమోదు చేస్తే? స్వయానా భూ పరిపాలనా విభాగానికి చెందిన ఓ ఉన్నతాధికారి, సీఎంవోలోని మరో ఉన్నతాధికారి షాడో సీఎంవోతో కలిసి ఈ తప్పుడు ప్రొసీడ్సింగ్స్ ఆధారంగా తుది అంకాన్ని ముగించేందుకు ప్రయత్నాలు చేస్తుంటే?! పైన చెప్పిన గండిపేట భూములకు నకిలీ జీవోలు సృష్టించిన వాళ్లకు, రావల్‌కోల్‌లో తప్పుడు ఉత్తర్వులు జారీ చేసిన వీళ్లకు పెద్ద తేడా ఏమైనా ఉన్నదా? మరి వీళ్లను శిక్షించొద్దా?
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 22 (నమస్తే తెలంగాణ): నాటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రస్తుత మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర మండలం రావల్కోల్ గ్రామ పరిధిలోని సర్వేనెంబరు 4-18, 20, 22, 25ల్లో 275.12 ఎకరాల ప్రభుత్వ భూమిని కొల్లగొట్టేందుకు నంబర్-2 మంత్రి, మరో మంత్రి, ‘ముఖ్యనేత’ బంధువుతోపాటు షాడో సీఎంవో వేసిన భారీ స్కెచ్‌ను కొన్నిరోజుల కిందట ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. రిటైర్మెంట్కు చేరువలో ఉన్న ఒక ఆర్డీవోకు కీసరలో పోస్టింగ్ ఇచ్చి, ఉద్యోగ విరమణకు మూడు రోజుల ముందు ఐదుగురు వ్యక్తులకు 275.12 ఎకరాలను కట్టబెడుతూ ఓఆర్సీ ప్రొసీడింగ్స్‌ను జారీ చేయించారు. అయితే ఈ బాగోతం బయటపడినప్పటి నుంచీ రోజుకో కొత్త ఉల్లంఘన తెరపైకి వస్తూనే ఉన్నది. స్వతంత్ర ట్రిబ్యునల్‌ను ప్రభావితం చేసేలా సీసీఎల్ఏ ఉన్నతాధికారి లేఖ రాయడంతోపాటు సీఎంవోలోని మరో ఉన్నతాధికారి అడ్వకేట్ జనరల్‌తోనూ లేఖ రాయించిన విషయాలు బయటికొచ్చాయి. అయితే సర్కార్ పెద్దల ఒత్తిడితో ఈ ఇద్దరు ఉన్నతాధికారులు చివరి అంకాన్ని ముగించేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో మరో సంచలన ఆధారం ‘నమస్తే తెలంగాణ’ చేతికి చిక్కింది. మేడ్చల్ తహసీల్దార్ భూపాల్ ఎలాంటి నివేదిక ఇవ్వకముందే కీసర ఆర్డీవో తన ప్రొసీడింగ్స్‌లో సదరు తహసీల్దార్ నివేదిక ఇచ్చినట్టుగా తప్పుడు సమాచారాన్ని నమోదు చేసినట్టు తాజాగా తేలింది.
ఇనామ్ రద్దు చట్టంలోని నిబంధనలివీ..
ఇనామ్ రద్దు చట్టం-1955 ప్రకారం ఇనామ్ భూములకు సంబంధించి స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. సెక్షన్-4 ప్రకారం ఇనామ్‌లు రద్దయిన భూములన్నీ ప్రభుత్వ ఖాతాలోకి చేరాయి. సెక్షన్-7 ప్రకారం నవంబర్ 1, 1973 నాటికి ఆ భూముల్లో ఇనామ్దారుగానీ, అతని వారసులుగానీ సాగు చేసుకుంటే వారికి ఓఆర్సీ ఇవ్వాలి. ఇందుకుగాను సెక్షన్-8 ప్రకారం ఇనామ్ ట్రిబ్యునల్ ఛైర్మన్ హోదాలో ఆర్డీవో ఓఆర్సీలను జారీ చేయాల్సి ఉంటుంది. అయితే ఇందుకు సంబంధించి జరిగే విచారణలో తెలంగాణ రెవెన్యూ చట్టం-1970లోని సెక్షన్-6 ప్రకారం సంబంధిత మండల తహసీల్దార్ విచారణ చేసి 1-11-1973 నుంచి ఇప్పటివరకు ఆ భూమిలో ఎవరు ఉన్నారు? ఇనామ్‌దారు ఎవరు? వారి వారసులు ఎవరు? వా రసత్వాన్ని ధృవీకరించే డాక్యుమెంట్లు ఉన్నా యా? ప్రస్తుతం ఆ భూమి పరిస్థితి ఏమిటి? అ నే అంశాలను తేల్చాలి. ఆ వివరాలను నాలుగు పేజీల నమూనా ఫారంలో నమోదు చేసి ఆర్డీవోకు సమర్పించాలి. దానినే తహసీల్దార్ ప్రిలిమినరీ రిపోర్ట్ అంటారు.
సర్కార్ పెద్దల అండతో బరితెగింపు
ఒక అధికారి సంతకాన్ని ఇతరులు పెడితేనే దానిని ఫోర్జరీ అంటారు. అలాంటిది ఒక అధికారి నివేదిక ఇవ్వకుండానే, ఇచ్చినట్టుగా అధికారికంగా నమోదు చేయడాన్ని ఏమంటారు? సర్కార్ పెద్దల అండతో రావల్కోల్ భూదందాలో జరిగిన అధికారిక బరితెగింపు ఇదే. 275.12 ఎకరాల భూములపై ఓఆర్సీలు ఇవ్వాలని, తామే అసలు ఇనామ్‌దారు వారసులమంటూ కొందరు ఫారం-1 రూపంలో దరఖాస్తు చేసుకున్నారు. దానిపై విచారణ చేసి, నివేదిక ఇవ్వాలని కీసర ఆర్డీవో ఈ ఏడాది ఫిబ్రవరి 13న మేడ్చల్ తహసీల్దార్‌కు లేఖ రాశారు. దానిపై మే 25న తహసీల్దార్ భూపాల్ నివేదిక రూపొందించారు. ఆ నివేదికను మే 29న ఆర్డీవో కార్యాలయంలో సమర్పించారు. కానీ కీసర ఆర్డీవో మాత్రం తహసీల్దార్ మే 25న నివేదిక సమర్పించారని ఓఆర్సీ ప్రొసీడింగ్స్‌లో పొందుపర్చారు. అంటే.. తహసీల్దార్ నివేదిక ఇవ్వకముందే ఆర్డీవో దానిని అధికారిక ప్రొసీడింగ్స్‌లో నమోదు చేశారు. ఇది ఫోర్జరీకి మించిన నేరం అని న్యాయనిపుణులు స్పష్టంచేస్తున్నారు. ముఖ్యంగా ఇనామ్ రద్దు చట్టం ప్రకారం తహసీల్దార్ ప్రిలిమినరీ రిపోర్ట్ ఇవ్వాలి. కానీ అది లేకుండానే ప్రొసీడింగ్స్ జారీ చేయడమంటే ఆ ప్రొసీడింగ్స్‌కు విలువ ఉండదని చెప్తున్నారు. అంటే పునాదిలేని భవనంలాంటిదన్నమాట.
తహసీల్దార్ నివేదికలో సంచలన విషయాలు
మేడ్చల్ తహసీల్దార్ నివేదిక ఇచ్చారంటూ తప్పుడు ప్రొసీడింగ్స్‌లో పొందుపర్చడమే కాకుండా, తహసీల్దార్ నివేదికలోని అంశాలను పూర్తిగా వక్రీకరించడం గమనార్హం. మే 25న మేడ్చల్ తహసీల్దార్ కేవలం భూమి మీద తాజా పరిస్థితిని వివరిస్తూ స్టేటస్ రిపోర్టు మాత్రమే రూపొందించారు.
అందులోని కీలకమైన అంశాలివీ..
- ఆర్డీవోకు ఇచ్చిన ఫారం-1లో మహ్మద్ గౌస్, మరో ముగ్గురు వ్యక్తులు.. హలీంబీతోపాటు మరో ఆరుగురు సర్వేనెంబరు 4-18, 20, 22, 25ల్లోని 279.12 ఎకరాలకు తాము వారసులమైనందున ఓఆర్సీలు ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై మండల గిర్దావర్ను విచారించాలని ఆదేశించగా ఆయన నివేదిక ఇచ్చారు.
- 1954-55 ఖాస్రా పహాణీ ప్రకారం ఈ భూములు రియాసత్ అలీ, జాహిద్ అలీ పేరిట పన్మక్తాగా నమోదైంది. 1973-74లో మాఫీ మక్తాగా వీరి పేర్లు ఇనామ్దారుగా వచ్చాయి. కానీ కబ్జా కాలంలో సీ వెంకట్రాంరెడ్డి పేరు నమోదైంది.
- 2016-17లో ఖారిజ్ ఖాతాగా నమోదయ్యాయి. పట్టాదారుగా సింగిరెడ్డి శోభ, ఇతరుల పేర్లు ఉన్నాయి.
- మండల గిర్దావర్ గ్రామంలో విచారించగా… ఓఆర్సీ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లు రావల్‌కోల్‌లో ఉండటం లేదని తేలింది.
- అందుకే వారసత్వ ధృవీకరణ పత్రాలు సమర్పించాలని దరఖాస్తుదారులను కోరగా, మహ్మద్ గౌస్‌తోపాటు మరో నలుగురు తాము వారసులమంటూ నోటరీ అఫిడవిట్ మాత్రమే సమర్పించారు. కానీ వారసత్వ ధృవీకరణ పత్రాలు సమర్పించలేదు.
- మండల గిర్దావర్ క్షేత్రస్థాయిలో భూములను పరిశీలించగా… కొంత విస్తీర్ణం గుట్టలతో ఉంది. మరికొంత టేకు చెట్లతో (లేఅవుట్ ప్లాట్లలో పెంచే చెట్టు) నిండి ఉంది. మరికొంత విస్తీర్ణం పడావుగా ఉంటే ఇంకొంత భూముల్లో థర్డ్ పార్టీకి చెందిన వారు సాగు చేస్తున్నారు.
ఆర్డీవో వక్రీకరించింది ఇలా..
మేడ్చల్ తహసీల్దార్ నివేదికలో సంచలనమైన వాస్తవాలు ఇలా ఉండగా.. కీసర ఆర్డీవోగా ఉన్న రాజేశ్‌కుమార్ తాను ఉద్యోగ విరమణ చేయడానికి మూడురోజుల ముందు జారీ చేసిన ఓఆర్సీ ప్రొసీడింగ్స్‌లో పూర్తిగా వక్రీకరించారు. మే 25న ఇచ్చిన తహసీల్దార్ నివేదిక ప్రకారం.. ఆయన క్షేత్రస్థాయిలో విచారించి, ఇనామ్‌దారు అసలైన వారసులు 1973 నుంచి 275.12 ఎకరాల్లో పొజిషన్లో ఉన్నారని, కబ్జా, వారసత్వాన్ని ధృవీకరించారంటూ తప్పుడు సమాచారాన్ని పొందుపర్చారు. పైగా ఐదుగురిని వారసులుగా పేర్కొంటూ తలా 55 ఎకరాల్లో పొజిషన్లో ఉన్నారని తహసీల్దార్ తన నివేదికలో స్పష్టంచేశారని ఆర్డీవో తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విచిత్రమేమిటంటే.. తహసీల్దార్ స్టేటర్ రిపోర్టులో నోటరీ అఫిడవిట్లో ఇచ్చిన పేర్లను మాత్రమే ప్రస్తావించగా, ఆర్డీవో మాత్రం తన ప్రొసీడింగ్స్‌లో ఐదుగురు పేర్లు, అసలు ఇనామ్దారుతో వారికి బంధుత్వం, వాళ్లు 55 ఎకరాల కబ్జా సర్వేనెంబర్ల వారీగా విస్తీర్ణాన్ని పేర్కొన్నారు. పైగా, ఈ వివరాలను తహసీల్దార్ తన నివేదికలో ఇచ్చారని అబద్ధపు సమాచారాన్ని ప్రొసీడింగ్స్‌లో ఉంచారు.
సివిల్ సర్వీస్ అధికారుల తీరుపై విస్మయం
రావల్కోల్ భూ దందాలో తెరవెనుక సర్కార్ పెద్దలతోపాటు కొందరు సివిల్ సర్వీసెస్ అధికారులు సైతం పాత్రధారులుగా ఉండటంపై కక్షిదారులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలో ఓఆర్సీల జారీ, ప్రభుత్వ భూముల రక్షణ బాధ్యత చూడాల్సిన సీసీఎల్ఏ ఏకంగా 275.12 ఎకరాల భూమి ప్రైవేట్‌కు ధారాదత్తం అయ్యేలా, ఇనామ్ ట్రిబ్యునల్‌ను ప్రభావితం చేసేలా నేరుగా లేఖ రాయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా అడ్వకేట్ జనరల్ లేఖ రాయడం వెనుక సీఎంవోలోని మరో ఉన్నతాధికారి పాత్ర ఉన్నదని అనుమానిస్తున్నారు. వీళ్ల తీరుపై డీవోపీటీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది.
కలెక్టర్‌కు తెలిసినా మౌనమెందుకు?
ప్రభుత్వ పెద్దలు తెరవెనుక ఎన్నో జిమ్మిక్కులు చేసి ఆర్డీవోను ప్రలోభపరుచుకున్నారనేది బహిరంగ రహస్యం. కానీ మేడ్చల్ తహసీల్దార్ మాత్రం వాస్తవ నివేదికను ఇచ్చారని తాజాగా అర్థమవుతున్నది. తహసీల్దార్ మే 29న ఆర్డీవో కార్యాలయంలో నివేదికను సమర్పించారు. అదే సమయంలో జిల్లా కలెక్టర్‌కు కూడా నివేదిక కాపీని పంపినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దానిని చూసిన ఎవరికైనా ఆర్డీవో ప్రొసీడింగ్స్‌లోని వివరాలకు పూర్తి భిన్నంగా ఉన్నాయని, అసలు ఇనామ్‌దారు వారసులమని చెప్పుకొంటున్న వారి వారసత్వ ధృవీకరణ జరుగలేదని అర్థమవుతుంది. వాళ్లు రావల్కోల్ గ్రామంలో నివసించడంలేదని స్పష్టమవుతుంది. ఈ క్రమంలో వారసులు కబ్జాలో ఉన్నారనేది పూర్తి అవాస్తవంగా తేటతెల్లమవుతుంది. దీంతో ఓఆర్సీ ప్రొసీడింగ్స్ జారీ అనేది పూర్తి అక్రమంగా గుర్తించవచ్చు. జిల్లా కలెక్టర్‌కు తహసీల్దార్ నివేదిక అందిన తర్వాత ఈ దిశగా ఎందుకు చర్యలు తీసుకోలేదు? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తప్పుడు సమాచారంతో రూ.5వేల కోట్ల విలువైన 275.12 ఎకరాల ప్రభుత్వ భూమి ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం అవుతున్న విషయాన్ని కలెక్టర్ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లాల్సిన అవసరముందని రిటైర్డ్ అధికారులు చెప్తున్నారు.
సుప్రీంకోర్టు స్టేకు సైతం వక్రభాష్యం
అసలైన ఇనామ్‌దారు లేదా వారి వారసులకు మాత్రమే ఓఆర్సీ ఇవ్వాలనే హైకోర్ట్ తీర్పును ఆధారంగా చేసుకొని కీసర ఆర్డీవో ప్రొసీడింగ్స్ ఇచ్చారు. డబ్ల్యూపీ నెం.913/2002, 3329/2006, 3376/2010, డబ్ల్యూఏ నెం.1531, 1608/ 2004, 543, 547/2021లోని పేరా 58లో కొనుగోలుదారులకు ఓఆర్సీలు పొందేందుకు అర్హులు కారని, ఇనామ్‌దారు గానీ వాళ్ల వారసులకు మాత్రమే ఓఆర్సీ ఇవ్వాలని హైకోర్టు తీర్పు ఉన్నందున, దాని ఆధారంగా ఈ ప్రొసీడింగ్స్ ఇస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే ఈ తీర్పు 2022లో రాగా,అదే సంవత్సరం కొనుగోలుదారులు అందరూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టేటస్ కో 024171/ 2022, 024172/ 2022, తేది: 23.12.2022 ఇచ్చింది. అంటే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమల్లో ఉండవనేది ఎవరికైనా తెలిసిన సత్యమే. కానీ దీనిని సైతం కీసర ఆర్డీవో రాజేశ్‌కుమార్ వక్రీకరించడం గమనార్హం.
సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేకు ఈ కేసుకు ఎలాంటి సంబంధంలేదని సుప్రీంకోర్టు స్టేను ఆయన కొట్టిపారేశారు. ఇదే నిజమైతే… ఆర్డీవో ఏ హైకోర్టు తీర్పును ఆధారంగా చేసుకొని ఓఆర్సీ ప్రొసీడింగ్స్ జారీ చేశారో… ఆ కేసుకు, ఈ కేసుకు కూడా సంబంధం లేదు. అలాంటప్పుడు సంబంధంలేని హైకోర్టు ఈ ఉత్తర్వులకు పనికొచ్చినపుడు, సంబంధంలేని సుప్రీంకోర్టు స్టే ఉత్తర్వులు కూడా పనికొస్తాయి కదా అని న్యాయనిపుణులు ప్రశ్నిస్తున్నారు. కీసర ఆర్డీవో తనకు అనుకూలంగా ఉండే హైకోర్టు ఉత్తర్వులను అమలు (అడాప్ట్) చేసుకొని, అడ్డంకిగా ఉన్న వాటిని తమకు సంబంధంలేదని కొట్టిపారేయడమంటే సుప్రీంకోర్టు ఉల్లంఘన కిందికే వస్తుందని అంటున్నారు. అందుకే ఆర్డీవో ప్రొసీడింగ్స్‌పై కోర్టు ఉల్లంఘన కేసు కూడా నమోదు చేస్తామని ఓ కక్షిదారు ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

