హైదరాబాద్: భారత దేశానికి తెలంగాణ దిక్సూచి అయిందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. తొమ్మిదిన్నరేండ్లలో సీఎం కేసీఆర్ (CM KCR) పాలన సాధించిన ఘనత ఇదన్నారు. నేడు తెలంగాణ (Telangana) ఆచరిస్తున్నది.. దేశం అనుసరిస్తున్నదని చెప్పారు. రాష్ట్రంలో సమగ్ర, సమతుల్య, సమ్మిళిత, సమీకృత అభివృద్ధి కొనసాగుతున్నదని వెల్లడించారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. 2014లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.లక్షా 14 వేలుగా ఉందని, ప్రస్తుతం అది రూ.3లక్షల 17 వేలకు పెరిగిందన్నారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు ఎలాంటి వివక్ష, కులమత భేదాలు లేకుండా జీవిస్తున్నారని చెప్పారు.
సీఎం కేసీఆర్ పాలన సంక్షేమానికి స్వర్ణయుగమన్నారు. అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉందని చెప్పారు. అభివృద్ధికి పెద్దపీట వేశారని తెలిపారు. రాష్ట్రాన్ని అప్పులపాటు చేశారన్న ఆరోపణలు సరికాదన్నారు. అప్పులు చేసిన నిధులు సంపద సృష్టికి ఉపయోగిస్తున్నామని చెప్పారు. రుణాలు మొత్తం సాగునీటి రంగం, మిషన్ భగీరథకు వినియోగించామన్నారు. మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందిస్తున్నామని వెల్లడించారు. విద్యుత్ రంగంలో సంస్కరణల కోసం రుణాలు తెచ్చారని చెప్పారు. తద్వారా స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మూడు రెట్లు పెంచామన్నారు.
అభివృద్ధి, సంక్షేమంలో సమతుల్యం సాధించామని తెలిపారు. అటు పల్లెలు, ఇటు పట్టణాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి జాతీయ అవార్డుల్లో తెలంగాణకే సింహభాగం దక్కాయని చెప్పారు. 7.7 శాతం గ్రీన్ కవర్ పెంచడం దేశంలోనే అద్భుతమన్ని వెల్లడించారు. ఐటీ రంగంలో బెంగళూరును హైదరాబాద్ దాటేసిందని చెప్పారు. ఐటీ ఎగుమతులు 400 శాతం పెరిగాయని తెలిపారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉందన్నారు. దేశానికి అన్నపూర్ణగా ఎదిగిందని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చింది శూన్యమని విమర్శించారు.
ఉన్న తెలంగాణను ఆనాడు ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ఆకాంక్షను దశాబ్దాల పాటు కాంగ్రెస్ అణచివేసిందని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని హామీ ఇచ్చిన సోనియా మోసం చేశారని, దీంతో వందల మంది బలిదానాలు చేసుకున్నారని ఫైర్ అయ్యారు. సోనియా గాంధీని బలిదేవత అన్నది రేవంత్ రెడ్డేనని గుర్తుచేశారు. కాంగ్రెస్ చేసిన పాపానికి తెలంగాణ 58 ఏండ్లు బాధపడిందన్నారు.
కాంగ్రెస్ పదేండ్ల పాలనలో తెలంగాణలో ఏడాదికి వెయ్యి ఉద్యోగాలు మాత్రమే వచ్చాయని విమర్శించారు. తాము తొమ్మిదిన్నరేండ్లలో లక్ష 32 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. మరో 90 వేల ఉద్యోగ నియామకాలు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదని విమర్శించారు. ఇప్పుడు 33 జిల్లాల్లో వైద్య కళాశాలలు ఉన్నాయని చెప్పారు. ఒకప్పుడు మైగ్రేషన్‌కు కేరాఫ్‌గా ఉన్న పాలమూరు ఇప్పుడు ఇరిగేషన్‌కు కేరాఫ్‌గా మారిందన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం రూపుమాపిందని చెప్పారు.
కాంగ్రెస్, బీజేపీలకు అభివృద్ధిపై విజన్ లేదని విమర్శించారు. అధికారం కోసం అర్రాజ్ పాటలా హామీలు గుప్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలవారికి పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌పైనే ప్రజలకు నమ్మకమున్నదని స్పష్టం చేశారు. మోదీ ఇస్తానన్న ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. పేదల ఖాతాలో వేస్తానన్న రూ.15 లక్షలు ఎక్కడపోయాయని నిలదీశారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్నారని, దేశాన్ని ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ చేస్తానన్నారని, దేశంలోని పేదలందరికీ ఇండ్లు కట్టిస్తామన్నారని అవన్నీ అయ్యాయా అని ప్రశ్నించారు. తాము చేసిన పనులు చెప్పుకొని మూడోసారి ఎన్నికలకు వెళ్తున్నామన్నారు. అభివృద్ధికి ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నామని స్పష్టం చేశారు. ప్రతీకార రాజకీయాలు చేస్తే రేవంత్ ఇప్పటికీ జైల్లోనే ఉండేవాడని చెప్పారు. ముస్లిం మైనార్టీలకు దేశంలోని ఏ రాష్ట్రంలో లేనంత బడ్జెట్ తెలంగాణలోనే ఉందని వెల్లడించారు.