హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రతి మత్స్యకారుడికి అందించేలా అర్హులను సొసైటీల్లో సభ్యులుగా చేర్చేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్టు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. 18 ఏండ్లు నిండిన ప్రతి మత్స్యకారుడికి మత్స్యసొసైటీలో సభ్యత్వం కల్పిస్తామని చెప్పారు. శుక్రవారం నాంపల్లి హార్టికల్చర్ ట్రైనింగ్ సెంటర్లో మత్స్యశాఖ అధికారుల ఒకరోజు వర్షాప్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుతం చేప పిల్లలను పక రాష్ర్ర్టాల నుంచి కొనుగోలు చేస్తున్నామని, చేప పిల్లల ఉత్పత్తిలో రాష్ట్రం స్వయం సమృద్ధి సాధించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు ముందుకొస్తే సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వ పరిధిలోని 23 చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.1.30 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పారు. ఈ కేంద్రాల ద్వారా 2019-20లో 2.5 కోట్ల చేప పిల్లలను, 2020-21లో 5 కోట్ల చేప పిల్లలను ఉత్పత్తి చేసినట్టు వివరించారు. రాష్ట్రంలోని చెరువులు, జలాశయాల్లో చేప పిల్లలను విడుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యలతో భారీగా మత్స్య సంపద పెరిగి మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెరిగాయని చెప్పారు. కార్యక్రమంలో మత్స్యశాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, అడిషనల్ డైరెక్టర్ శంకర్‌రాథోడ్, జాయింట్ డైరెక్టర్లు శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, మురళీకృష్ణ, అధికారులు పాల్గొన్నారు.