మంచాల, ఏప్రిల్ 11: వ్యవసాయం పైనే ఆధారపడి బతుకుతున్నామని, రిజర్వాయర్ పేరిట తమ భూములు తీసుకుంటే ఎట్లా బతికేదని రైతులు అధికారులను నిలదీశారు. భూమికి బదులుగా భూమి ఇప్పించాలని లేదంటే ప్రభుత్వం నిర్ణయించిన ధరకు రెండింతలు పెంచి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా శివన్నగూడం రిజర్వాయర్ కోసం శుక్రవారం రంగారెడ్డి జిల్లా మంచాల మండల రెవెన్యూ పరిధిలోని శ్రీమంత గూడలో భూసేకరణపై అధికారులు అభిప్రాయ సేకరణ జరిపారు. శ్రీమంతగూడలోని సర్వే నంబర్లు 48 నుంచి 66 వరకు 148.31 ఎకరాల భూమికి సంబంధించి 267 మంది రైతులు ఉన్నారని, వీరికి ప్రభుత్వం ఎకరానికి రూ.27 లక్షల పరిహారం ఇస్తుందని అధికారులు తెలిపారు.
రంగారెడ్డి జిల్లాలో ఎకరం ధర రూ.కోటి పలుకుతుంటే తమకు రూ.27 లక్షలు ఇవ్వడం ఏమిటని నిలదీశారు. ఈ భూములను ఇస్తే తామెలా బతకాలని ప్రశ్నించారు. తమ భూములను ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం గుంజుకోవాలని చూడటం సరికాదని అన్నారు. భూములు తీసుకుంటే తమ పిల్లలకు పెండ్లిళ్లు ఎట్లా అవుతాయంటూ? ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లాలో ఎకరం భూమికి మార్కెట్లో ఎంత ధర ఉందో అంత కట్టివ్వాలని లేదా ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే రెండు రెట్లు పెంచి ఇవ్వాలని అప్పుడే భూసేకరణకు సహకరిస్తామని లేదంటే అడ్డుకుంటామని హెచ్చరించారు. దీంతో చేసేదేమీ లేక ఇరిగేషన్ శాఖ అధికారి సురేందర్‌రెడ్డి, మంచాల తహసీల్దార్ కేవీవీ ప్రసాద్ రావు, ఈఈ రాములు తదితరులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.