హైదరాబాద్, జూన్ 17 (నమస్తేతెలంగాణ): ‘ఆపరేషన్ కగార్’ పేరుతో దేశంలో కొనసాగిస్తున్న మానవ హననాన్ని తక్షణమే నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని రాజకీయ పార్టీల నాయకులు, పౌర హకుల ప్రతినిధులు, ప్రజాసంఘాల నేతలు ముక్తకంఠంతో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశంలో పేదరికం, అంతరాలు, అసమానతలు ఉన్నంత కాలం కమ్యూనిజం, మావోయిజం ఉంటుందని స్పష్టం చేశారు. ఉద్యమకారులను పాలకులు భౌతికంగా నిర్మూలించగలరేమో గానీ కమ్యూనిజాన్ని, మావోయిజాన్ని అంతం చేయడం ఎవరితరమూ కాదని ఉద్ఘాటించారు. శాంతి చర్చల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహించారు. శాంతి చర్చల కమిటీ అధ్యక్షుడు జస్టిస్ బీ చంద్రకుమార్, ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ జీ హరగోపాల్, కందిమళ్ల ప్రతాపరెడ్డి అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేంత వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టంచేశారు. ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఢిల్లీలో మహాధర్నా నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వెంటనే కాల్పుల విరమణ ప్రకటించి, మావోయిస్టు పార్టీతో బేషరతుగా శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ధర్నాను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఎమ్మె ల్సీ నెల్లికంటి సత్యం తదితరులు పాల్గొన్నారు.
చర్చలే శాశ్వత పరిష్కారం: దాసోజు శ్రవణ్
ప్రజాస్వామ్యంలో చర్చల ద్వారానే శాంతి, సామరస్యం సాధ్యమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. కేంద్రం వెంటనే ఆపరేషన్ కగార్‌ను నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. పాకిస్థాన్, తాలిబన్ వంటి పాలన మనకు పనికిరాదని చెప్పారు. ఆపరేషన్ కగార్‌పై సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని, గిరిజన హక్కులను కాపాడాలని కోరారు.
ప్రశ్నిస్తే నక్సలైట్ అంటున్నారు: ఆర్ నారాయణమూర్తి
ప్రశ్నిస్తే నక్సలైట్ అని ముద్రవేస్తున్నారని ప్రముఖ దర్శక నిర్మాత, నటుడు ఆర్ నారాయణమూర్తి ఆవేదన వ్యక్తంచేశారు. అడిగితే అన్నలని అంటున్నారని, అడగకుండా నోరుమూసుకుంటే ఎన్ని తప్పులు చేసినా ఆల్రైట్ అంటున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపరేషన్ కగార్‌ను నిలిపివేసి మావోయిస్టు సంఘాలు, నేతలతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.
మృతదేహాలను చూసినా వారికి భయమే: కే నారాయణ
మావోయిస్టుల మృతదేహాలను చూసినా పాలకులు భయపడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ అన్నారు. మావోయిస్టుల ముక్త్ భారత్ కాదని, త్వరలోనే అమిత్ షా ముక్త్ భారత్ ఉద్యమాలు రాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. ఏ జెండా లేని ఉగ్రవాదులతోనే చర్చలకు సిద్ధమైనప్పుడు రాజకీయ ఎజెండా ఉన్న మావోయిస్టులతో చర్చించేందుకు కేంద్రానికి ఉన్న అభ్యంతరమేంటని ప్రశ్నించారు.
చట్టం ప్రకారం ప్రధాని, హోంమంత్రి ముద్దాయిలు: కూనంనేని
గోద్రా ఘటనలో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలను చట్టం ముద్దాయిలుగా పేర్కొన్నదని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మావోయిస్టులు తప్పు చేస్తే రాజ్యాంగబద్ధంగా శిక్షించాలి తప్ప, భౌతికంగా అంతం చేసే అధికారం మీకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. కమ్యునిస్టులను అంతం చేయడం నియంతలైన ముస్సోలిని, హిట్లర్ వల్లే కాలేదని గుర్తుచేశారు.