హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో సైబర్ నేరాలను అరికట్టడమే లక్ష్యంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రంగంలోకి దిగింది. శాంతి భద్రతల విభాగం పోలీసులతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా ‘ఆపరేషన్ క్రాక్ డౌన్ 2.0’ను ప్రారంభించినట్టు డీజీ శిఖాగోయెల్ వెల్లడించారు. ఆదివారం ఆమె ప్రకటన విడుదల చేశారు. గతంలో అరెస్టయిన నేరగాళ్లు మళ్లీ నేరాలకు పాల్పడకుండా నిరోధించడమే ఈ భారీ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. 2024-2025 మధ్య కాలంలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,567 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసినట్టు చెప్పారు.
వీరిలో తెలంగాణకు చెందినవారు 614 మంది ఉండగా, వారి ప్రస్తుత కార్యకలాపాలపై పోలీసులు నిఘా పెట్టారని తెలిపారు. వీరిలో ప్రధానంగా మ్యూల్ అకౌంట్ హోల్డర్లు 269 మంది, ఏజెంట్లు 155 మంది, చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ మెటీరియల్(సీఎస్ఏఎమ్) నిందితులు 36 మంది, సైబర్ స్లేవరీ, ఫేక్ సిమ్ డీలర్లు, బ్యాంక్ ఉద్యోగులు తదితరులు ఉన్నట్టు తెలిపారు. ఆపరేషన్ క్రాక్‌డౌన్ 2.0ను సమర్థవంతంగా నిర్వహించేందుకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ నేతృత్వంలో 300 బృందాలు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.