ములుగు, ఏప్రిల్25(నమస్తేతెలంగాణ) : తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దు పరిధిలోని ములుగు జిల్లా కర్రెగుట్టల వద్ద ఐదు రోజులుగా మావోయిస్టు పార్టీ అగ్రనేతలే టార్గెట్గా పోలీస్ బలగాలు సెర్చింగ్ ఆపరేషన్ను కొనసాగిస్తున్నాయి. ఛత్తీస్గఢ్ పోలీస్ బలగాలు కర్రెగుట్టలను చుట్టుముట్టగా హెలిక్యాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహిస్తూ అణువణువు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. దీంతో జిల్లాలోని వాజేడు, వెంకటాపురం (నూగూరు) మండలాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు పీఎల్జీఏ మహిళా సభ్యులు మృతి చెందగా, పలువురు మావోయిస్టులు గాయపడినట్టు బీజాపూర్ జిల్లా పోలీస్ అధికారులు తెలిపారు.
మావోయిస్టు పార్టీకి చెందిన డంపు లభ్యమైనట్టు ప్రచారం జరుగుతున్నది. డీఆర్జీ ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్, కోబ్రా, బస్తర్ ఫైటర్స్ చేపట్టిన ఈ జాయింట్ ఆపరేషన్ బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ పీ నేతృత్వంలో కొనసాగుతున్నట్టు తెలుస్తున్నది. కర్రెగుట్టల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఆపరేషన్ హిడ్మా పేరుతో మావోయిస్టు పార్టీ మిలటరీ చీఫ్గా వ్యవహరిస్తున్న హిడ్మాను టార్గెట్గా చేసుకొని కేంద్ర బలగాలు సెర్చింగ్ నిర్వహిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం హిడ్మా రెండు ప్లాటూన్ దళాలను వెంట పెట్టుకొని కర్రెగుట్టలకు చేరుకున్నట్టు తెలుస్తున్నది.
తెలంగాణ రాష్ట్ర కమిటీ పరిధిలో ఉన్న కర్రెగుట్టలపై మావోయిస్టు కార్యకలాపాలు గణనీయంగా తగ్గిపోయాయని అంచనా వేసినప్పటికీ అనూహ్యంగా కర్రెగుట్టల వద్ద హిడ్మా వచ్చాడనే సమాచారంతో అధికారులు కేంద్ర బలగాలను అప్రమత్తం చేసినట్టు తెలుస్తున్నది. మిలటరీ ప్లాటూన్ బదలాయించడంతో పాటు మావోయిస్టుల శిక్షణకు సంబంధించిన వ్యవహారాలను చక్కబెట్టేందుకు హిడ్మా కర్రెగుట్టలపై డెన్ ఏర్పాటు చేసుకున్నట్టు పోలీసు అధికారులు భావిస్తున్నారు. కర్రె గుట్టలపై మావోయిస్టులు మందు పాతర్లతో పాటు బంకర్లను ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తుంది. కర్రె గుట్టల వద్ద ఛత్తీస్గఢ్ బలగాలు నిత్యం కూంబింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో గుట్టమీద ఉన్న మావోయిస్టులు తప్పించుకొని రాష్ట్రంలోకి చొరబడే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసిన అధికారులు సరిహద్దు గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ములుగు జిల్లాలోని పలు గ్రామాల్లో పోలీసులు విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తున్నది.