హైదరాబాద్ సిటీబ్యూరో, మే 7 (నమస్తే తెలంగాణ): కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో పోలీసులు మాక్‌డ్రిల్ నిర్వహించారు. ‘ఆపరేషన్ అభ్యాస్’ పేరిట భద్రతా బలగాలు బుధవారం ఈ మాక్‌డ్రిల్ చేపట్టాయి. మాక్‌డ్రిల్‌లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసు, అగ్నిమాపక, జీహెచ్ఎంసీ, రెవెన్యూ, ఎన్సీసీ, వైద్య, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, విద్యుత్తు, ట్రాన్స్‌పోర్టు సహా మొత్తం 12 విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సికింద్రాబాద్, నానల్‌నగర్, కంచన్‌బాగ్ డీఆర్డీవో, గోల్కొండ కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల సమయంలో 2నిమిషాల పాటు సైరన్ మోగించారు. అగ్నిప్రమాదం జరిగినట్టు, బాంబులు పేలినట్టు శబ్దాలు వినిపించాయి. సంఘ విద్రోహశక్తులు, ఉగ్రవాదులు అపార్ట్మెంట్లలోకి చొరబడి కాల్పులు జరిపినట్టు, వివిధశాఖ ఆధ్వర్యంలో సహాయ చర్యలు చేపట్టినట్టు చూపించారు. కొన్ని ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు, కాల్పుల వల్ల మంటలు వ్యాపిస్తే వాటిని ఆర్పేందుకు ఫైరింజన్లు మోహరించారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించాల్సిన తీరుపై ప్రజలకు అవగాహన కల్పించామని అధికారులు చెప్పారు. ప్రజలు పూర్తిగా సహకరించారని తెలిపారు.