నేరేడుచర్ల, నవంబర్ 15 : రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాక్షసపాలన కొనసాగుతున్నదని, ప్రశ్నిస్తే కేసులు నమోదు చేసి జైల్లో పెడుతున్నారని బీఆర్ఎస్ హుజూర్నగర్ నియోజకవర్గ సమన్వయ కర్త ఒంటెద్దు నర్సింహారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం విలేకర్లతో మాట్లాడారు. కలెక్టరే దాడి జరుగలేదని చెప్తున్నా.. జైల్లో పెట్టారని, లగచర్ల గిరిజన కుటుంబాల ఉసురు సీఎంకు తగులుతుందని మండిపడ్డారు.
తెలంగాణ భవన్లో గిరిజన మహిళలు తమ వెనక ఏ పార్టీ, ఎవరూ లేరని, భూములను కాపాడుకోవడానికే కడుపుమండి ఆందోళన చేపడుతున్నామని చెప్పారని పేర్కొన్నారు. 1600 ఎకరాలు ఫార్మా కంపెనీలకు అప్పగించేందుకు ఒప్పందం కుదిరిందని, దాని ద్వారా వేల కోట్లు కమీషన్ వస్తుందని ఆరోపించారు. కొడంగల్ నుంచే రేవంత్‌రెడ్డి పతనం ప్రారంభమైనదని అన్నారు.
పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సొంత నియోజకవర్గంలోనే ధాన్యం కొనుగోలు చేయాలని ట్రాక్టర్లతో నిరసన వ్యక్తం చేస్తుంటే ఆయన మహారాష్ట్రలో ప్రచారం నిర్వహిస్తున్నారని తెలిపారు. 20 రోజులైన ధాన్యం కొనుగోళ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులపైన అక్రమ కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అయినా ఎవరూ భయపడరని చెప్పారు. అనంతరం నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడికి వచ్చిన రైతులు బాధలను అడిగి తెలుసుకున్నారు. రైస్ మిల్లులో అమ్మిన ధాన్యానికి కూడా ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి, మండలాధ్యక్షుడు అరిబండి సురేశ్‌బాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ చందమళ్ల జయబాబు, మాజీ ఎంపీపీ చెన్నబోయిన సైదులు, బీఆర్ఎస్ పట్టణ, మండల ప్రధాన కార్యదర్శులు చిత్తలూరి సైదులు, యల్లబోయిన లింగయ్య, హుజూర్నగర్ మాజీ జడ్పీటీసీ కొప్పు సైదిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్‌రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వర్రావు, నేరేడుచర్ల మాజీ గ్రంథాలయ చైర్మన్ గుర్రం మార్కండేయ, తదితరులు ఉన్నారు.