Telangana | వరంగల్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అన్నదాతలు, మహిళలు, యువత, విద్యార్థులు… ఇలా వర్గాల ప్రజలు బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు తరలివచ్చారు. సైకిల్, ఎండ్లబండి, మోటరు సైకిల్, ఆటో, కారు, టాటాఎస్, వ్యాను, బస్సు… వాహనం ఏదైనా, అన్నీ ఎల్కతుర్తికే చేరాయి. అనుకున్నట్టుగానే ఎవరికి వారుగా బయలుదేరి మహాసభలో కలుసుకున్నారు. ఇంటి పెద్దాయన, ఇల్లాలు, ఉద్యోగం చేసే కొడుకు, చదువుకునే బిడ్డ… తెలంగాణ రాష్ర్టాన్ని దిక్సూచిగా నిలిపిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగం వినేందుకు అందరూ ఎల్కతుర్తికి చేరారు. ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు, తెలంగాణవాదులు, కేసీఆర్ అభిమానులు లక్షలాదిగా తరలి వచ్చిన జనంతో ఎల్కతుర్తి కిటకిటలాడింది.
అన్నదాతల దారి
బీఆర్ఎస్ మహాసభకు ఊరూరా అన్నదాతలు తరలివచ్చారు. సభలో రైతులే ఎక్కువ మంది కనిపించారు. ప్రతి పల్లె నుంచి రైతులు ఉత్సాహంగా సభకు వచ్చారు. బీఆర్ఎస్ మొదటి నుంచి రైతుల పక్షాన నిలబడింది. కేసీఆర్ హయాంలోనే రాష్ట్రంలో సాగు బాగైంది. 16 నెలలుగా కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు ఆగమవుతున్నారు. బీఆర్ఎస్తోనే భరోసా ఉంటుందని అన్నదాతలు అధిక సంఖ్యలో వచ్చారు. కేసీఆర్ హయాంలో సాగునీరు, కరెంటు, పంటలకు ధర ఉన్నదని గుర్తుచేసుకున్నరు. కేసీఆర్ ప్రసంగంతో వ్యవసాయంపై ధీమా పెరిగిందని చెప్పుకున్నారు. ‘కేసీఆర్ ఉన్నప్పుడు ఎవుసం బాగుండె. ఇప్పుడు నీళ్లు వస్తలేవు. పంటలు పండలే. బోనస్ లేదు, ధర లేదు. మళ్ల కేసీఆర్ వస్తనే రైతులు మంచిగుంటరు’ అని కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన సత్యనారాయణ చెప్పారు.
సగం మంది మహిళలే
సభకు వచ్చిన వారిలో సగం మంది మహిళలే ఉన్నారు. మహిళా సంక్షేమం, కుటుంబ అవసరాలను తీర్చిన పార్టీగా మహిళల్లో బీఆర్ఎస్కు ఉన్న ఆదరణ ఎల్కతుర్తి సభతో తెలిసిపోయింది.‘బీఆర్ఎస్ సర్కారు ఇచ్చిన పథకాలతో అన్ని కుటుంబాలు బాగున్నయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బిడ్డ పెండ్లి చేసి ఏడాది అయినా కల్యాణలక్ష్మి వస్తలేదు. కాన్పు సుత అయ్యింది. దవాఖానలో అప్పుడు మా పెద్ద బిడ్డకు కేసీఆర్ కిట్ ఇచ్చిండ్రు. సర్కారు దవాఖానలో కాన్పుకు పోదామంటే మా వాళ్లు అప్పటి లెక్కలేదు వద్దన్నరు. కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని మంచిగుండె. ఇప్పుడు తెర్లయింది’ అని వరంగల్‌లోని పోచమ్మమైదాన్‌కు చెందిన నీలగిరి రాజమణి చెప్పారు.
సండే యూత్ జోష్
సభలో సగం కంటే ఎక్కువగా యువత ఉన్నారు. కేసీఆర్ ప్రసంగం వినేందుకు హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి యువత, విద్యార్థులు ఉత్సాహంగా సభకు వచ్చారు. రాజకీయాలకు దూరంగా ఉంటారనే అభిప్రాయాన్ని చెరిపివేస్తూ సభకు వచ్చిన మహిళల్లో ఎక్కువ మంది యువతులు ఉన్నారు. ఆదివారం కావడంతో ఉద్యోగాలు చేసే వారు, యువత ఎక్కువ మంది ఓ ట్రిప్లాగా ఎల్కతుర్తి సభకు వచ్చిన పరిస్థితి కనిపించింది. ‘బీఆర్ఎస్ అంటే ఎమోషన్. మేం క్యాంపస్‌లో ఉన్నప్పుడు ఉద్యమ సభలు మిస్ కాలేదు. ఆ తర్వాత రాష్ట్రం వచ్చి మంచిగా అభివృద్ధి చెందింది. బీఆర్ఎస్ మీటింగ్ మళ్లీ కొత్త ఆశలు తెచ్చింది. అప్పటి బ్యాచ్ వాళ్లం ఫోన్లలో అనుకుని మొత్తం మీటింగ్‌కు వచ్చినం. బీఆర్ఎస్ సభ అప్పటి ఉద్యమ రోజులను గుర్తుకు తెచ్చింది’ అని హైదరాబాద్‌లోని సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోల శ్రీనివాస్ పాత రోజులను గుర్తుకు తెచ్చారు.
ఆటోవాలా చలో..
కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలతో తీవ్రంగా నష్టపోయిన వర్గాలు భరోసా కోసం బీఆర్ఎస్ సభకు తరలివచ్చాయి. ఆటో యజమానులు, డ్రైవర్లు స్వచ్ఛందంగా ఆటోల్లో ప్రజలను తీసుకుని బీఆర్ఎస్ సభకు వచ్చారు. అసంఘటితంగా ఉన్న ఆటోవాలాల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం తమ గురించి ఆలోచించకుండా వ్యవహరిస్తున్నదని ఆటోవాళ్లు వాపోయారు. ‘ఉచిత బస్సు పథకాన్ని తప్పుబట్టడంలేదు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న రోజుల్లో మా జీవితాలు బాగుండె. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక మాకు అన్యాయం మొదలైంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. బీఆర్ఎస్ మాకు ఎప్పుడూ అండగా ఉన్నది. ఉద్యమం రోజుల నుంచి మాతో కలిసి నడిచింది’ అని హైదరాబాద్‌కు చెందిన లావుడ్యా రాజునాయక్ పేర్కొన్నారు.