బంజారాహిల్స్, అక్టోబర్ 13: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓట్ల చోరీ వ్యవహారంలో అసలు వాస్తవం బట్టబయలైంది. ఆ అపార్ట్మెంట్ ఓటరు జాబితాలో ఉన్న 44 మందిలో కేవలం ఇద్దరు మాత్రమే ఇక్కడ నివాసం ఉంటున్నారని తేలింది. మిగతా వారికి ఈ ప్రాంతానికి సంబంధమే లేదని విచారణలో వెల్లడైంది. ఓట్లచోరీ ఆరోపణలపై సోమవారం ఎన్నికల సంఘం అధికారులు విచారణ ప్రారంభించారు. యూసుఫ్‌గూడ డివిజన్ పరిధిలోని బూత్ నంబర్ 246లోని సంస్కృతి అవెన్యూలో స్థానిక బీఎల్వో, సూపర్వైజర్, ఏఆర్వోలతో కూడిన బృందం వివరాలు సేకకరించారు. ఓటరు జాబితాలోని 1006 నుంచి 1048 నంబర్ వరకు కలిగిన ఓటర్లలో ఇద్దరు మాత్రమే ఆ అపార్ట్మెంట్లో ఉంటున్నారని తేలింది. ఐదు ఫ్లోర్లలోని ఈ అపార్ట్మెంట్లో 15 ఫ్లాట్లు ఉండగా మూడు ఫ్లాట్లు ఖాళీ ఉన్నాయని గుర్తించారు. మరో 12 ఫ్లాట్ల వివరాలను సేకరించారు. ప్లాట్ నంబర్ 101లో నివాసం ఉంటున్న ముగ్గురు వ్యక్తులు కర్నూల్ జిల్లా కోవెలకుంట్లకు చెందిన వారని తేలింది. తమకి సొంతూరిలోనే ఓట్లున్నాయని పేర్కొన్నారు.
ఫ్లాట్ నంబర్ 102, 103లో ఉంటున్న రెండు కుటుంబాల్లో కలిపి నలుగురే ఉన్నారని, వారికి కూడా సొంతూళ్లలో ఓట్లున్నాయని గుర్తించారు. 201 ఫ్లాట్‌లో ఉంటున్న కుటుంబంలోని నలుగురికీ విజయవాడలో మాత్రమే ఓట్లున్నాయని, కృష్ణానగర్‌లో ఓట్లు లేవని తేలింది. ఫ్లాట్ నంబర్ 202లోని అద్దెకు ఉంటున్న వారికి వైజాగ్‌లో ఓట్లున్నాయని, ఇక్కడ తమకు ఓట్లు లేవని పేర్కొన్నారు. ఫ్లాట్ నెంబర్ 203లో భార్యాభర్తలున్నారని, తమకు వేరే నియోజకవర్గంలో ఓట్లున్నాయని ఇక్కడ తాము దరఖాస్తే చేసుకోలేదని తేలింది. 302 ఫ్లాట్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలకు రాజమండ్రిలో మాత్రమే ఓట్లున్నాయని, ఇక్కడ దరఖాస్తు చేసుకోనేలేదని తెలిపారు. ఫ్లాట్ నంబర్ 401లో నివాసం ఉంటున్న రామకృష్ణ, అతడి సతీమణి మాత్రం ఆరునెలల క్రితం ఇక్కడకే ఓట్లను మార్చుకున్నారని గుర్తించారు.
402లో భార్యాభర్తలు ఉండగా ఒకరికి మాత్రం ఓటు ఉన్నదని తేలింది. 403లో ఉంటున్న వారికి కృష్ణానగర్ ఏ బ్లాక్‌లో ఓట్లు ఉన్నాయని, అక్కడకు వెళ్లే వారు ఓట్లు వేస్తారని తేలింది. ఫ్లాట్ నంబర్ 501 కట్టినప్పటి నుంచి ఖాళీగా ఉన్నదని గుర్తించారు. ఫ్లాట్ నంబర్ 502లోని భార్యాభర్తల్లో భార్యకు మాత్రం ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఓటు ఉన్నదని, 503లో ఎవరికీ ఓట్లు లేవని తేలింది. మొత్తం సంస్కృతి ఎవెన్యూ పేరుతో ఉన్న ఓటరు జాబితాలో ఉన్న 44 మందిలో కేవలం ఇద్దరు మాత్రమే ఇక్కడ నివాసం ఉంటున్నారని, మిగతా వారు ఎవరో తమకు తెలియదని అపార్ట్మెంట్ వాసులే తేల్చి చెప్పారు.
ఆ ఓట్లు ఎవరివి?
స్థానిక కాంగ్రెస్ నేత మంగళారపు మల్లికార్జున్ యాదవ్, అతడి సోదరుడైన రౌడీషీటర్ మంగళారపు అర్జున్ యాదవ్‌కు చెందిన ఇంటినంబర్ 118 పేరుతో ఉన్న ఓటరు జాబితాలో 49 మంది ఓటర్లు ఉండగా, వారిలో మల్లికార్జున్ యాదవ్ కుటుంబానికి చెందిన నలుగురు ఓటర్లతోపాటు మరో నలుగురైదురు తప్ప మిగతా వారెవరూ అక్కడ ఉండటమే లేదని, వారి పేరుతో బోగస్ ఓట్లు తయారు చేసినట్టు స్థానికులు పేర్కొన్నారు. జీ ప్లస్ 3 భవనంలో రెండు ఫ్లోర్లలో హాస్టల్ నడుస్తున్నదని తేలింది. ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం అధికారులు విచారించగా, తమ ఇంటిపేరుతో అదనంగా ఓట్లు ఎలా వచ్చాయో తెలియదంటూ మల్లికార్జున్ యాదవ్ పేర్కొన్నట్టు తేలింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్‌కు సన్నిహితుడిగా ఉన్న మల్లికార్జున్ యాదవ్ ఇంట్లో ఆయనకు తెలియకుండా దొంగ ఓట్లు ఎలా వస్తాయంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.