Congress | మణికొండ, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీ రాజేంద్రనగర్ నియోజకవర్గంలో అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. పార్టీ అభ్యున్నతి కోసం శ్రమించిన నేతలను పక్కన పెట్టి, కొత్తగా వచ్చిన వారికి నామినేటెడ్ పదవులు కట్టబెట్టడమేంటని యువనేతలు మండిపడుతున్నారు. డబ్బులు ఉన్నవాళ్లకే పదవులు ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు మణికొండ, నార్సింగి, రాజేంద్రనగర్ కాంగ్రెస్ యువనేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. నార్సింగి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గంలో నామినేటెడ్ పదవులు ఆశించి భంగపడ్డ ఎన్ఎస్యూఐ రాజేంద్రనగర్ నియోజకవర్గ అధ్యక్షుడు దుడ్డు ప్రణయ్ సహా పలువురు నేతలు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
పార్టీ నేతల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కొంతమంది నేతల ఏకపక్ష నిర్ణయాలతో నిజమైన కార్యకర్తలకు తీరని అన్యాయం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్ఎస్యూఐ నియోజకవర్గ అధ్యక్షుడిగా పోరాటాలు చేసి, రెండు సార్లు జైలుకు వెళ్లానని, ఇప్పటికీ తనపై 11 కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. పార్టీ సమావేశాల్లోనూ తనతో పాటు దళిత, మైనారిటి లీడర్లను అవమానిస్తున్నారని తెలిపారు. నార్సింగి మార్కెట్ కమిటీ పాలకవర్గంలో పార్టీ కోసం పనిచేయని వారికి పదవులు కట్టబెట్టారని విమర్శించారు.
నామినేటెడ్ పదవులు కావాలని అడిగితే మీ వద్ద రూ.50లక్షల డబ్బులున్నాయా? పదవులు ఊరికే రావు అంటూ కొంతమంది నేతలు అన్నారు. డబ్బులుంటేనే పదవులు ఇస్తారా? నేనొక దళిత బిడ్డను, నాతో పాటు చాలా మంది మైనారిటి యువత పార్టీ కోసం అహర్నిశలు శ్రమించారు. మాకు కాకుండా పార్టీలు మారినోళ్లకు పదవులు ఎలా ఇస్తారు.అంటూ దుడ్డు ప్రణయ్ ప్రశ్నించారు. నేతల తీరుపై అధిష్ఠానానికి ఫిర్యాదులు చేయడానికి, న్యాయపోరాటానికి కూడా సిద్ధ్దమవుతున్నామని తెలిపారు.