వనపర్తి, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : సంప్రదాయ సాగు నుంచి రైతులు బయటకొచ్చి లాభాలు అందించే పంటలను సాగు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సూచించారు. శ్రీకాంత్‌రెడ్డి అనే రైతు వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం చిన్నమందడిలో ప్రత్యామ్నాయ పంటగా సాగు చేసిన సీతాఫలాలను శనివారం వనపర్తిలో మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి రైతును అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నూనె, పప్పు గింజలు, ఉద్యాన పంటలు సిరులు కురిపిస్తాయని తెలిపారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు ఎంపిక చేసుకొని సాగు చేయాలని సూచించారు. ఉద్యాన శాఖ సబ్సిడీపై కూరగాయల నారును అందిస్తున్నట్టు చెప్పారు. రైతులు, వ్యవసాయ, ఉద్యాన అధికారుల సలహాలు, సూచనలను తీసుకోవాలని అన్నారు.