రుణమాఫీ అనుభవంతో రైతాంగంలో ఆందోళనరైతుబంధు రెండు సీజన్లకు అందలేదు. రుణమాఫీ అరకొరగానే ముగించేశారు. బోనస్ నాల్గోవంతు సన్నాలకైనా దక్కలేదు. ఈ మూడు సంఘటనలతో కాంగ్రెస్ చెప్తున్న మాటలకు, చేతలకూ మధ్య పొంతన లేదని తేలిపోయింది. దీంతో సంక్రాంతి నుంచి రైతుభరోసా అని సర్కార్ చెప్తున్నా రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఎన్ని కొర్రీలు పెడ్తారోనని, ఇంకెంత కోత విధిస్తారో నని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబంలో ఒక్కరికే.. అదికూడా ఏడెకరాలకే రైతుభరోసా ఇస్తారన్న వార్త ఆందోళన కలిగిస్తున్నది.
Rythu Bharosa | హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): కుటుంబంలో ఎంతమంది ఉన్నా.. ఒక్కరికి మాత్రమే పంట పెట్టుబడి సాయం ఇవ్వాలని, లేదా కుటుంబ పెద్ద విచక్షణ మేరకు ఏడు ఎకరాలకు మించకుండా కుటుంబ సభ్యులకు సాయం అందించాలని ప్రభుత్వం సూచనప్రాయంగా నిర్ణయించినట్టు సమాచారం. రైతు భరోసా కింద ఒక కుటుంబంలో గరిష్ఠంగా ఏడు ఎకరాల సీలింగ్ విధించాలని నిర్ణయించినట్టు తెలిసింది. సీజన్ల వారీగా, సాంకేతిక సర్వేల ఆధారంగా సాగుభూమిని లెక్కగట్టి, సాగు చేస్తున్న భూమికే రైతుభరోసా ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు ఆదివారం సమావేశమైన క్యాబినెట్ సబ్ కమిటీ రైతు భరోసా విధివిధానాలపై కసరత్తు చేసింది. కష్టకాలంలో ఉన్న రైతులకు మానవతా దృకృథంతో ఏ మేరకు సహాయం అందించగలం అనే కోణంలో కాకుండా ఏ మేరకు సహాయాన్ని కుదించవచ్చుననే అంశంపైనే క్యాబినెట్ సబ్ కమిటీ ఎక్కువ సమయం కేటాయించినట్టు తెలుస్తున్నది. తాజా సమాచారం మేరకు క్యాబినెట్ సబ్ కమిటీ సూత్రప్రాయంగా తీసుకున్న నిర్ణయాలను యధాతథంగా అమలు చేస్తే, దాదాపు 20 లక్షలకుపైగా అర్హులైన రైతులకు అన్యాయం జరిగే అవకాశం ఉన్నది.
ఏడెకరాల సీలింగ్?
ఒక కుటుంబానికి గరిష్ఠంగా ఎన్ని ఎకరాల వరకు రైతుభరోసా పెట్టుబడి సాయం ఇవ్వాలనే విషయం మీదనే క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్‌లో ఎక్కువ సేపు కసరత్తు జరిగినట్టు తెలుస్తున్నది. పది ఎకరాలలోపు భూమికి రైతు భరోసా ఇవ్వాలని తొలుత మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రతిపాదించగా.. మిగిలిన మంత్రులు ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇప్పుడున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అది సాధ్యం కాదని తేల్చిచెప్పినట్టు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం తరహాలో ఐదు ఎకరాలకు పరిమితం చేద్దామని సూచించినట్టు సమాచారం.
కేంద్రం మాదిరిగా తాము కూడా ఐదు ఎకరాలకే పెట్టుబడి సాయం చేస్తే..! ఆ..క్రెడిట్ కేంద్రానికే వెళ్తుందని, కేంద్రం ఇచ్చిన కిసాన్ సమ్మాన్ పథకానికే రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చి ఇస్తున్నదంటూ బీజేపీ ప్రచారం చేసుకునే అవకాశం ఉన్నదనే చర్చ జరిగినట్టు తెలిసింది. మధ్యే మార్గంగా ఏడెకరాల వరకు రైతుభరోసా ఇవ్వాలనే ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు సమాచారం. ఒక్క కుటుంబానికి ఎంత భూమి ఉన్నప్పటికీ, ఎంతమంది కుటుంబసభ్యులు ఉన్నప్పటికీ గరిష్ఠంగా ఏడెకరాలకు మించకుండా రైతు భరోసా సాయం అందించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఎక్కువ మంది సంతానం, ఎక్కువ మొత్తంలో భూ విస్తీర్ణం ఉన్న కుటుంబంలో ఎవరికి ఎంత ఇవ్వాలనేది కుటుంబ పెద్ద విచక్షణను పరిగణనలోకి తీసుకొని, స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారులు నిర్ణయం తీసుకోవాలని ప్రాథమిక ఆలోచన చేసినట్టు తెలిసింది.
పంటను బట్టి పెట్టుబడి సాయం
ఏకీకృత పంట విధానం కాకుండా, పంట రకాల వారీగా పెట్టుబడి సాయం నిర్ణయించాలనే ప్రతిపాదనపై కూడా క్యాబినెట్ సబ్ కమిటీ చర్చించినట్టు తెలిసింది. ఈ సహాయం ఏడాది మొత్తానికి కలిపి ఒకేసారి ఇవ్వాలా? వానకాలం, యాసంగి సీజన్లకు వేర్వేరుగా ఇవ్వాలా? అనే అంశం మీద చర్చించినట్టు సమాచారం. పత్తి, మిరప పంటలు ఏడాదికి ఒక్కసారి మాత్రమే సాగు చేస్తారని, ఆరు నెలల్లో పంట చేతికి అందుతుందని, ఇక ఆ తరువాత రైతు భూమిని ఖాళీగానే ఉంచుతారని, ఖాళీ భూమికి పెట్టుబడి సాయం ఎందుకు ఇవ్వాలనే ఆలోచన చేసినట్టు తెలుస్తున్నది. రాష్ట్రంలో పండ్ల తోటలకు రైతు భరోసా వర్తింప చేయాలా? వద్దా? అనే అంశం మీద చర్చ జరిగినట్టు సమాచారం.
పండ్ల తోటలకు ఒకటి, రెండేండ్లపాటు పెట్టుబడి పెడితే మూడో ఏడాది నుంచి ఫలసాయం అందుతుందని, ఫలసాయం అందే సమయంలో రైతు భరోసా అవసరం లేదని సబ్ కమిటీ అభిప్రాయపడ్డట్టు తెలిసింది. సాగు మీద ప్రతి సీజన్లో సర్వే చేయాలని, ఇందుకోసం నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ సహకారం తీసుకోవాలని, ఎంత భూమి సాగు చేశారో.. సీలింగ్ పరిమితికి లోబడి అంతే భూమికి పెట్టుబడి సాయం అందజేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఏడాదికి మూడుసార్లు సాగు చేసే వరి లాంటి పంటలకు ఏడాదికి రెండు సీజన్లు మాత్రమే పెట్టుబడి సాయం చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. తద్వారా వానకాలంలో వచ్చే పెట్టుబడి సాయానికి, యాసంగిలో అందించే సాయానికి మధ్య ప్రభుత్వానికి కొంత మిగులుబాటు ఉంటుందని ఆలోచన చేసినట్టు తెలుస్తున్నది.
రైతులు, పెట్టుబడి సాయంలో తగ్గుదల
కొత్త మార్గదర్శకాలతో లబ్ధిదారుల సంఖ్య భారీగా తగ్గుతుందని సమాచారం. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించారు. వారికి ఇతోధికంగా సహాయపడాలనే ఆలోచన చేసేవారు. రైతుబంధు పథకం కింద 65 లక్షల మంది రైతులకు, 1.49 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయం అందించారు. నిజానికి, రాష్ట్రంలో ఒక హెక్టారు లేదా అంత కన్నా తక్కువ భూమి ఉన్న సన్నకారు రైతులు 47.86 లక్షల (74%) మంది ఉన్నారు. రెండు హెక్టార్ల భూమి ఉన్న చిన్నకారు రైతులు 11.50 లక్షల (18%) మంది ఉన్నారు.
సన్న, చిన్నకారు రైతుల వాటానే 92% ఉన్నది. ఏటా సగటున రూ.13 వేల కోట్ల చొప్పున ఆరేండ్లలో రూ.80,453.41 కోట్లు అప్పటి కేసీఆర్ ప్రభుత్వం రైతన్నల ఖాతాల్లో జమ చేసింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల నిర్దయతో ఆలోచన చేస్తున్నది. ఒక కుటుంబంలో ఏడు ఎకరాలు అనే సీలింగ్ పరిమితి పెట్టటం, మరికొన్ని సాంకేతిక అవరోధాలు సృష్టించటం ద్వారా గరిష్ఠంగా 40 లక్షల నుంచి 45 లక్షల మించి రైతులకు రైతు భరోసా అందే అవకాశం లేదని, కనీసం 20 లక్షల మంది అర్హత ఉన్న రైతులకు కూడా పెట్టుబడి సాయం అందక పోవచ్చని వ్యవసాయరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందున్నాయ్.. అయినా ఇస్తం: భట్టి
రైతు భరోసా ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చినమాట మేరకు ముందుకు వెళ్తామని రైతు భరోసా విధివిధానాల కోసం ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార చెప్పారు. సచివాలయంలో ఆదివారం భట్టి విక్రమార ఆధ్వర్యంలో సబ్ కమిటీ సభ్యులు తుమ్మల నాగేశ్వరరావు, దుదిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమావేశమయ్యారు. యాసంగి పంటకు రైతు భరోసా అందజేసేందుకు ఖరారు చేయాల్సిన విధి విధానాలపై రెండు గంటలపాటు కసరత్తు చేశారు. క్యాబినెట్ సబ్ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించిన క్రమంలో రైతులు వ్యక్తంచేసిన అభిప్రాయాలతోపాటు అధికారులు సేకరించిన సమాచారంపై చర్చించారు. రైతులకు బడ్జెట్లో అత్యధిక నిధులు కేటాయించడమే కాకుండా రుణమాఫీ చేశామని, బోనస్ ఇస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు.