Runa Mafi | హైదరాబాద్, ఆగస్టు19 (నమస్తే తెలంగాణ): రుణమాఫీ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని, డాటా క్లియర్‌గా ఉన్న రైతులకే రుణమాఫీ అయిందని సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.ప్రభుత్వ పాలసీ ప్రకారం వడ్డీ కడితేనే రూ. 2 లక్షల రుణం మాఫీ అవుతుందని స్పష్టం చేశారు. ఎక్సైజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఎర్రమంజిల్‌లోని జలసౌధ లో సోమవారం విలేకరులతో మాట్లాడారు. రుణమాఫీ పథకంపై ప్రతిపక్ష పార్టీలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. రుణమాఫీ పూర్తయిపోయిందని రైతులను పక్కదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ ప్రక్రియ పూర్తికాలేదని పేర్కొన్నారు. తాము చేసినట్టుగా రుణమాఫీ దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదని, బీజేపీ ప్రభుత్వం ఏనాడూ రైతులను పట్టించుకోలేదని మండిపడ్డారు.
అన్ని వివరాలు సరిగ్గా ఉన్న వారికి మాత్రమే ఆగస్టు 15 వరకు రుణాలు మాఫీ అయ్యాయని వివరించారు. ఆధార్‌లో తప్పులు, పాస్‌బుక్, ఆధార్‌లో పేర్లు సరిపోలకపోవడం, రేషన్‌కార్డు లేని కారణంగా 9.14లక్షల మందికి రుణమాఫీ కాలేదని, రూ 2 లక్షల లోన్‌కు సంబంధించి 8 లక్షల అకౌంట్లు ఉన్నాయని వెల్లడించారు. అవన్నీ కలిపితే దాదాపు 17.14లక్షల అకౌంట్లకు రుణమాఫీ కాలేదని తెలుస్తున్నది. అయితే, 8 లక్షల అకౌంట్లకు సంబంధించి రుణమాఫీ అయిందా? కాలేదా? అనే విషయంపై మాత్రం స్పష్టత నివ్వలేదు. రూ. 2 లక్షల పైన రుణం ఉన్నవారు వడ్డీ చెల్లిస్తేనే మాఫీ అవుతుందని పేర్కొన్నారు. ఏ కారణం చేతనైనా రుణమాఫీ పొందని రైతులు మండల వ్యవసాయాధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డూప్లికేట్ అకౌంట్స్ ఉన్నాయని, వాటిని పరిశీలించాల్సి ఉందని చెప్పారు. ప్రచారం కోసమే రుణమాఫీపై ఖర్గేకు కేటీఆర్ లేఖ రాశారని విమర్శించా రు. సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి పాల్గొన్నారు.