హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) జూన్ సెషన్ పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌లో డైరెక్టర్ నవీన్ నికోలస్, టెట్ కన్వీనర్ జీ రమేశ్ ఈ ఫలితాలు విడుదల చేశారు. ఈ సారి పేపర్-2 సోషల్‌లో 25.79% అభ్యర్థులు మాత్రమే క్వాలిఫై అయ్యారు. అంటే ఈ పేపర్ రాసిన వారిలో 75% మంది ఫెయిలయ్యారు.
2026 జనవరి టెట్‌లో సోషల్ పేపర్లో 35.86% క్వాలిఫై కాగా, ఈ సారి 25శాతమే క్వాలిఫై అయ్యారు. పేపర్-1లో 65.29%, పేపర్-2(గణితం, సైన్స్)లో 40.76% అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. 2026 జనవరి టెట్‌లో ఇన్‌సర్వీస్ టీచర్లు 37,893(57.76%) క్వాలిఫై కాగా, ఈ సారి 8,809(37.29%) మాత్రమే క్వాలిఫై అయ్యారు.
టెట్ పరీక్షలు సజావుగా నిర్వహించామని, తక్కువ సమయంలో ఫలితాలు విడుదల చేశామని నవీన్ నికోలస్ వెల్లడించారు. డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడిస్తారంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు నవీన్ నికోలస్ స్పందిస్తూ రెండేండ్ల క్రితమే 10వేల పోస్టులు భర్తీచేశామని, ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 17గా ఉందని బదులిచ్చారు.