హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా మోకిలలో హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన లేఅవుట్లో ప్లాట్ల ఆన్లైన్ విక్రయాన్ని సోమ, మంగళవారాల్లో నిర్వహించనున్నారు. ఇప్పటివరకు మూడు రోజుల పాటు వరుసగా శనివారం వరకు ఆన్లైన్ వేలం నిర్వహించారు. తిరిగి వేలాన్ని రెండు రోజులపాటు నిర్వహించి రోజుకు 60 ప్లాట్ల చొప్పున విక్రయించనున్నారు. ఐటీ కారిడార్ అతి సమీపంలో ఉన్న మోకిల లేఅవుట్‌కు మొదటి విడతలో 50 ప్లాట్లను విక్రయించగా, మంచి డిమాండ్ వచ్చింది. వెంటనే రెండో విడత ఆన్లైన్ వేలాన్ని 5 రోజుల పాటు నిర్వహించి, మొత్తం 300 ప్లాట్లను విక్రయించేలా షెడ్యూలును ఖరారు చేశారు. దానికి అనుగుణంగానే ఇప్పటి వరకు 3 రోజులపాటు ఆన్లైన్ వేలం పూర్తి కాగా, చివరి రెండు రోజులనూ పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.