నిజామాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియలో తీవ్రమైన అసంబద్ధతలు, ద్వంద్వ ప్రమాణాలు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేస్తున్నట్టు ఎన్నికల సంఘం చెప్తున్నది. కానీ మాటల్లో ఓ విధంగా, చేతల్లో మరోవిధంగా వ్యవహరిస్తూ ఓటర్లను గందరగోళంలో పడేస్తున్నది. సర్ ప్రక్రియలో క్షేత్రస్థాయిలో ఆధార్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నారని ఓటర్లు ఆరోపిస్తున్నారు. ఆన్లైన్ ఎన్యుమరేషన్ ఫారాల్లో పేర్లు, వివరాలు ఆధార్‌తో సరిపోకపోతే అప్లికేషన్లు తిరష్కరణకు గురవుతున్నాయని చెబుతున్నారు. ఈసీ ఎన్యుమరేషన్ ఫామ్‌ల్లో ఆధార్ నంబర్‌ను ఐచ్ఛికంగా పేర్కొంది. కానీ బీఎల్వోలు ఫీల్డ్ వెరిఫికేషన్‌లో ఆధార్‌ను తప్పనిసరిగా డిమాండ్ చేస్తున్నట్టుగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఈసీ అధికారిక వెబ్సైట్లో లభించిన సమాచారం ప్రకారం ఆధార్ వివరాలు సమర్పించకపోయినా దరఖాస్తును తిరస్కరించరాదని ఉన్నది.
కానీ ఆన్లైన్ పోర్టల్‌లో ఆధార్‌లోని పేరు, వివరాలు ఓటర్ ఐడీ(ఎపిక్)తో సరిపోకపోతే అప్లికేషన్‌ను అంగీకరించడం లేదు. చాలా మంది ఓటర్లు ఆధార్‌లో తల్లి, తండ్రి పేరు లేదా స్పెల్లింగ్ వ్యత్యాసాల వల్ల ఆన్లైన్ ఫామ్ సబ్మిట్ చేయలేకపోతున్నారు. ఇంటింటి పర్యటనలో బీఎల్వోలు ఆధార్‌కార్డు లేకుండా ఫారాలు స్వీకరించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది సుప్రీంకోర్టు సూచనలకు వ్యతిరేకం. ఆధార్ ఐచ్ఛికం అని చెప్పి, ఆచరణలో తప్పనిసరి చేయడం ఈసీ ద్వంద్వ వైఖరిని సూచిస్తున్నది. ఓ వైపు సర్ ప్రక్రియలో భాగంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది పేర్లు తొలగించారనే ప్రచారం జరుగుతున్నది. మరోవైపు ద్వంద్వ ప్రమాణాల వల్ల అసలైన ఓటర్లు కూడా ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉన్నదని ప్రజలు భయపడుతున్నారు. చనిపోయినవారు, డూప్లికేట్ ఓట్లను తీసేస్తే తప్పేమీ లేదని, అసలైన ఓట్లు కూడా తీసేస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా పొరపాట్లను ఈసీ సరిదిద్దాలని కోరుతున్నారు.
పని చేయని 1950
‘సర్’ ప్రక్రియలో ఇబ్బందులుంటే చెప్పాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం సూచిస్తున్నది. అధికారిక వెబ్సైట్లోనూ సూచనలు చేస్తున్నది. అనుమానాల నివృత్తికి కాల్ సెంటర్ నంబర్ 1950కు ఫోన్ చేయాలని చెబుతున్నది. అయితే, టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేస్తే ఎవరూ ఎత్తడం లేదు.