హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ వద్ద శుక్రవారం ముట్టడి కార్యక్రమం కొనసాగుతుంటే.. మరోపక్క గ్రూప్-4 ఉద్యోగాల కోసం నిర్వహిస్తున్న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం అభ్యర్థు లు వచ్చారు. ఈ క్రమంలో నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనతో గ్రూప్-4 అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. ఆందోళన నడుమ గ్రూప్-4 అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించారు.
తెలంగాణ మైనార్టీ గురుకుల రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీలో లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల నుంచి సొసైటీ వెబ్ఆప్షన్స్ను స్వీకరిస్తున్నది. శనివారం సాయంత్రం 6గంటల్లోగా వెబ్ కౌన్సెలింగ్ ఎంపిక చేసుకోవాలని వెల్లడించింది. 8న పోస్టింగ్ ఆర్డర్స్‌ను జారీ చేయనున్నట్టు సొసైటీ పేర్కొంది. తమకు కేటాయించిన పాఠశాలల్లో 9 నుంచి రిపోర్ట్ చేయాలని అభ్యర్థులకు స్పష్టంచేసింది.
హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బడ్జెట్లో భాగంగా రూ. 20 వేల కోట్లకు పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు రూపొందించింది. త్వరలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిర్వహించే సమావేశంలో ప్రతిపాదించనుంది. దీంట్లో రూ.16 వేల కోట్లకుపైగా నిధులు టీచర్ల వేతనాలకు సంబంధించినవే ఉండనున్నాయి. మిగతా మొత్తం సమగ్రశిక్ష, మధ్యాహ్న భోజన పథకంలో రాష్ట్ర వాటాగా ఉన్నట్టు తెలిసింది.