జయశంకర్ భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లి గ్రామంలోని మేడిగడ్డ (లక్ష్మి) బరాజ్‌లో(Medigadda barrage) నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) సూచనల మేరకు వరద ప్రవాహపు (Ongoing flow) అంచనా పరీక్షలు కొనసాగుతున్నాయి. శుక్రవారం పుణెకు చెందిన శాస్త్రవేత్తలు డాక్టర్ సంపత్, నాగరాజు ఆధ్వర్యంలో అకౌస్టిక్ డాప్లర్ కరెంట్ ప్రొఫెల్లర్ (ఏడీసీపీ) పరికరాన్ని పవర్ బోటుకు అమర్చి బరాజ్‌లోని అప్, డౌన్ స్ట్రీమ్‌ల్లో ప్రవాహాన్ని పరీక్షించారు.
కాగా, బరాజ్‌కు 6,50,570 క్యూసెక్కుల వరద వస్తుండగా, మొత్తం 85 గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు. అలాగే అన్నారం బరాజ్‌కు 6,000 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా, మొత్తం 66 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. కాగా, కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ద గోదావరి 6.50 లక్షల క్యూసెక్కులుగా పారుతూ లక్ష్మి బరాజ్ వైపు పరుగులు తీస్తున్నది. అలాగే ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క బరాజ్ వద్ద గోదావరి ప్రవాహం నిలకడగా ఉంది. శుక్రవారం 6,24,800 క్యూసెక్కుల వరద రాగా, మొత్తం 59 గేట్లు ఎత్తి అంతేమొత్తంలో నీటిని దిగువకు పంపిస్తున్నారు.