ఆదిలాబాద్ ఫొటోగ్రాఫర్ : రుణమాఫీ కాని రైతులు వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతుండగా, మాఫీ అయినవారు రెన్యూవల్ కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు లోపలికి ఒక్కొక్కరినే అనుమతించడంతో బ్యాంకు బయటే రైతులు గంటల తరబడి నిలబడ్డారు.
‘ఏ పని కావాలన్నా పైసలు అడుగుతున్నారు.. ఇవ్వకుంటే బయటకు పొమ్మంటున్నరు’ అంటూ శుక్రవారం కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించిన రైతులు. తాము నేరుగా వెళ్తే ఏ పని చేయడం లేదని, దళారులతో వెళ్తేనే పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు
– నాగిరెడ్డిపేట
పంట రుణాన్ని వెంటనే మాఫీ చేయాలని, లేకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడిస్తామని నిర్మల్ జిల్లా కుంటాలలో తహసీల్దార్, వ్యవసాయ కార్యాలయాల ఎదుట ధర్నా చేపట్టిన పెంచికల్పాడ్కు చెందిన రైతులు
– కుంటాల/కుభీర్
అర్హులైన రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని సీపీఎం బోనకల్లు మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా చేపట్టిన సీపీఎం ఖమ్మం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు చింతలచెరువు కోటేశ్వరరావు, బోనకల్లు మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు తదితరులు
– బోనకల్లు
రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సిద్దిపేట జిల్లా చేర్యాలలో ఎస్బీఐ ఎదుట రైతులు రోడ్డుపై ధర్నా చేశారు.రూ.2 లక్షల రుణాన్ని మాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. కొంతమందికకే మాఫీ చేసిందని ఆవేదన వ్యక్తంచేశారు.
-చేర్యాల
ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని రైతు సంఘం రాష్ట్ర నాయకుడు గొల్లపల్లి జయరాజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఏవో పరమేశ్‌కు వినతి పత్రం అందజేశారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకుడు, సీపీఏం జిల్లా కార్యదర్శి జయరాజు మాట్లాడుతూ.. ఒక్క సంగారెడ్డి జిల్లాలోనే 2.50 లక్షల మంది రైతులు ఉంటే.. ఇప్పటి వరకు మూడు విడతల్లో కేవలం 97,873 మందికి మాత్రమే రూ.846.31 కోట్ల రుణమాఫీ అయిందని వివరించారు. సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించి రైతులకు రుణమాఫీ చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
– సంగారెడ్డి కలెక్టరేట్
ప్రభుత్వం రుణమాఫీ చేసినట్టు చెప్పింది. తమకేమో మాఫీ కాలే. ఏమైందో తెలుసుకునేందుకు ఆఫీసుకొస్తే ఇక్కడ పట్టించుకునేటోళ్లే లేరని రైతులు వాపోయారు. పొద్దుగల్ల నుంచి ఇక్కడే ఉన్నా ఎవరూ తమ గోస పట్టించుకోవడం లేదంటూ నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌లోని మండల వ్యవసాయ శాఖ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. మాఫీ కాని రైతులు మండల కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం చెప్పడంతో రైతులు శుక్రవారం ఉదయమే ఆఫీసుకొస్తే ఎవరూ లేరు. 11 గంటలు దాటినా అధికారులు, సిబ్బంది రాకపోవడంతో అసహనానికి గురైన రైతులు నిరసన తెలిపారు. తమ గోస ఎవరితో చెప్పుకోవాల్నో అర్థమైతలేదని భీమ్‌గల్ మండలం కారేపల్లికి చెందిన మహిళా రైతు గుగ్లోత్ జెన్ను ఆవేదన వ్యక్తంచేసింది.
-భీమ్‌గల్