రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ చేనేత, మరమగ్గాల కార్మికులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సవతి ప్రేమ చూపుతున్నది. ఏడున్నరేండ్లుగా ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా, విజ్ఞప్తులు చేసినా స్పందించడం లేదు. పార్లమెంటులో వరిపై ఆందోళన చేసినట్టే.. చేనేత, మరమగ్గాల కార్మికుల సమస్యలపై యధావిధిగా నిరసన కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు. డిమాండ్లు నెరవేరే దాకా క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ గల్లా పట్టి నిలదీస్తాం’ అని రాష్ట్ర టెక్స్టైల్, మున్సిపల్, పరిశ్రమలశాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు హెచ్చరించారు. సిరిసిల్లకు మెగా పవర్‌లూం క్లస్టర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూం ఇవ్వాలని, తెలంగాణను పీఎం మిత్ర పథకంలో చేర్చి రూ.వెయ్యి కోట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం కలిసి రావాలని కోరారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రానికి మెగా పవర్‌లూం క్లస్టర్ ఇవ్వాలని కోరితే గుజరాత్, మహారాష్ట్రలోని ఇచ్చల్కరంజీ, సోలాపూర్, తమిళనాడు, రాజస్థాన్‌కు ఇచ్చిన కేంద్రం.. తెలంగాణకు మొండిచెయ్యి చూపిందని విమర్శించారు. టెక్స్టైల్స్ రంగం అభివృద్ధిలో శ్రీలంక, బంగ్లాదేశ్ కన్నా మన దేశం చాలా వెనుకబడి ఉన్నదని, కేంద్రం పని తీరుకు ఇదే నిదర్శనమని దుయ్యబట్టారు.
వర్కర్ టూ ఓనర్ సువర్ణాధ్యాయం
సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో చేనేత, మరమగ్గాల కార్మికుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్టు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయినా సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమకు రూ.1,134 కోట్లతో బతుకమ్మ చీరలు, క్రిస్మస్, రంజాన్, విద్యార్థుల యూనిఫాం తయారీ ఆర్డర్లు ఇచ్చినట్టు గుర్తుచేశారు. ప్రభుత్వ చేయూతతో ఒక్కో కార్మికుడు నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేలకు పైగా వేతనం పొందుతున్నాడని చెప్పారు. రైతుల మాదిరి చేనేత, మరమగ్గాల కార్మికులకు వ్యక్తిగత రుణమాఫీ, మరమగ్గాల ఆధునీకరణ, త్రిఫ్ట్, చేనేతమిత్ర వంటి కార్యక్రమాలు చేపట్టినట్టు వెల్లడించారు. కార్మికుడిని యజమానిని చేయాలన్న సంకల్పంతో ‘వర్కర్ టూ ఓనర్’ పథకానికి శ్రీకారం చుట్టామని, రూ.400 కోట్లతో చేపడుతున్న ఈ పథకం దేశచరిత్రలో సువర్ణాధ్యాయమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉండాల్సిన కేంద్రం మొండిచెయ్యి చూపుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
26 బ్లాక్ క్లస్టర్లు అడిగితే.. ఇచ్చింది ఆరు
పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, దుబ్బా క, సిద్దిపేట, కమలాపూర్లాంటి ప్రాంతాల్లో 26 బ్లాక్ లెవల్ క్లస్టర్లు ఇవ్వాలని కేంద్రాన్ని అడిగితే.. ఆరు ఇచ్చి చేతులు దులుపుకొన్నదని కేటీఆర్ విమర్శించారు. గడిచిన ఏడున్నరేండ్లలో కేంద్ర చేనేత, జౌళిశాఖల మంత్రులకు వందల లేఖలు, వినతి పత్రాలు ఇచ్చినా ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తంచేశారు. గత ప్రభుత్వాలు చేయూ త ఇవ్వనందుకే వరంగల్‌లోని ఆజంజాహీ మిల్లు మూతపడి వేలమంది కార్మికులు రోడ్డున పడ్డారని గుర్తుచేశారు. టెక్స్టైల్ రంగాన్ని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో వరంగల్‌లో 600 ఎకరాల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్పర్స న్ జిందం కళ, టీఆర్ఎస్ నాయకుడు గూడూరి ప్రవీణ్, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో చేనేత, మరమగ్గాల కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాం. వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయినా సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమకు రూ.1,134 కోట్లతో బతుకమ్మ చీరలు, క్రిస్మస్ గిఫ్ట్, రంజాన్ తోఫా, విద్యార్థుల యూనిఫాం తయారీ ఆర్డర్లు ఇచ్చాం. ప్రభుత్వ చేయూతతో ఒక్కో కార్మికుడు నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేలకు పైగా వేతనం పొందుతున్నాడు.