హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ) : మోటర్ వెహికిల్ చట్టంపై అవగాహన పెరిగినప్పుడే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీ శామ్ కోషీ అన్నారు. సోమవారం హైదరాబాద్ కుందన్‌బాగ్‌లోని చిన్మయ విద్యాలయంలో ‘రోడ్ సేఫ్టీ అభియాన్-2026’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు చిన్ననాటి నుంచే రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు.
తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్య కార్యదర్శి సీహెచ్ పంచాక్షరీ మాట్లాడుతూ .. ఈనెల 9వరకు రోడ్డు భద్రతపై విద్యార్థులు, యువతలో చైతన్యం తెచ్చేందుకు జిల్లాస్థాయి, మండలస్థాయి లీగల్ సర్వీసెస్ కమిటీల ఆధ్వర్యంలో స్కూళ్లు, కాలేజీల్లో అవగాహనా శిబిరాలను నిర్వహించనున్నట్టు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలతోపాటు మోటర్ వెహికిల్ చట్టంలోని నియమ, నిబంధనలపై అవగాహన కల్పించనున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్నగర్ పోలీస్ సహాయక కమిషనర్ ఎస్వీ రాఘవేందర్రావు, స్కూల్ ప్రిన్సిపల్ రామగిరి విద్యాసాగర్ పాల్గొన్నారు.