హుస్నాబాద్, అక్టోబర్ 31 : మొంథా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో గుర్తించి బాధిత రైతులకు పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ డిమాండ్ చేశారు. హుస్నాబాద్ పట్టణ శివారులో భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి, హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, సైదాపూర్, ఎల్కతుర్తి మండలాల్లో తుఫాన్ కారణంగా పంటలు, రోడ్లు, ఇండ్లకు తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పారు.
పంటలు దెబ్బతిన్న రైతులకు ఎకరాకు రూ.10వేలు ఇస్తామని సీఎం రేవంత్ ప్రకటించడం సరికాదని, ఎకరానికి రూ.25వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో ఐకేపీ సెంటర్లు, కల్లాల్లో తడిసిన ధాన్యాన్ని షరతులు లేకుండా కొనుగోలు చేసేలా మంత్రి పొన్నం చర్యలు తీసుకోవాలని కోరారు. నియోజకవర్గంలో భారీ వర్షాల కారణంగా భీమదేవరపల్లికి చెందిన దంపతులు కల్పన- ప్రణయ్, కొత్తపల్లికి చెందిన నాగేంద్ర, అక్కన్నేపట మండలం మల్లంపల్లికి చెందిన రామకృష్ణ మృతి చెందటం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. వీరి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.