పెద్దపల్లి : పెద్దపల్లి(Peddapalli) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బైక్ అదుపు తప్పి చెట్టును ఢీ కొనడంతో(Bike accident) ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన ఇప్పలపల్లి శివారులో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కాల్వ శ్రీరాంపూర్ మండలం మల్యాల గ్రామ పరిధిలోని జగ్గయ్యపల్లెకు చెందిన ఉప్పుల దేవేందర్(33)ద్విచక్ర వాహనం పై నుంచి పడి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
దేవేందర్ సోమవారం రాత్రి కాల్వ శ్రీరాంపూర్కి వెళ్లి స్వగ్రామమైన మల్యాల గ్రామ పరిధిలోని జగ్గయ్య పల్లెకు వస్తుండగా ఇప్పలపల్లి శివారులో ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఓంకార్ యాదవ్ తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కాగా, మృతునికి భార్య జ్యోతి, కుమారుడు యశ్వంత్ ఉన్నారు. దేవేందర్ మృతితో బంధువుల రోదనలు మిన్నంటాయి.