హాలియా, మే 17 : ఆంధ్రా నుంచి ధాన్యాన్ని అక్రమంగా తీసుకొచ్చి బినామీ రైతుల పేరుతో నల్లగొండ జిల్లాలోని ఐకేపీ కేంద్రాల్లో విక్రయిస్తున్న వారిని శనివారం జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలో నల్లగొండ జిల్లా అనుముల, పెద్దవూర మండలాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నట్టు తెలిసింది. ఆంధ్రా నుంచి ధాన్యం రాష్ట్రంలోకి రాకుండా నిరోధించేందుకు పోలీసులు ఉమ్మడి జిల్లాలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.
ఇటీవల అక్రమంగా తెలంగాణలోకి ధాన్యం తీసుకొస్తున్న లారీలను పట్టుకొని విచారణ చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ కేంద్రాల్లో క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని చెప్పడంతో దానిని కాజేసేందుకు అనుముల, పెద్దవూర మండలాలకు చెందిన కొందరు కాంగ్రెస్ నాయకులు ముఠాగా ఏర్పడి ఆంధ్రాలో రైతుల వద్ద తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసి తెలంగాణ ఐకేపీ కేంద్రాల్లో అమ్ముకుంటూ బోనస్ కాజేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు చెక్‌పోస్టు అధికారులను, సిబ్బందిని మచ్చిక చేసుకొని ఆంధ్రా నుంచి ధాన్యం తీసుకువచ్చి విక్రయించినట్టు తేలింది.
ఇటీవల పలు లారీలను సీజ్ చేశారు. టాస్క్‌ఫోర్స్ అధికారులు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ని ఐకేపీ కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు. దీంతో ధాన్యం అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టు బయటికొచ్చింది. శనివారం జిల్లా ట్రాస్క్ఫోర్స్ పోలీసులు అనుముల గ్రామానికి చెందిన హాలియా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ భర్త పిల్లి ఆంజనేయులతోపాటు మరో ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. పెద్దవూర మండలానికి చెందిన అధికార పార్టీ నాయకుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. కాంగ్రెస్ నేతల అరెస్ట్‌తో దళారులకు సహకరించిన రైతుల్లో గుబు లు మొదలైంది. ధాన్యం వ్యాపారులంతా కాంగ్రెస్ నాయకులే కావడంతో వారిని విడిపించేందుకు ఆ పార్టీకి చెందిన పెద్దాయన రంగంలోనికి దిగినట్టు సమాచారం.