హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఒకశాతం విద్యార్థులు ఏదో ఒక వైకల్యంతో బాధపడుతున్నారు. 18 ఏండ్లలోపు పిల్లల్లో ప్రతి వంద మందిలో ఒకరు ఏదో ఒక సమస్యతో సతమతమవుతున్నారు. 2024-25 విద్యాసంవత్సరంలో రాష్ట్రంలో 72,672 మంది విద్యార్థులు వైకల్యంతో బాధపడుతున్నట్టు పాఠశాల విద్యాశాఖ తేల్చింది. రాష్ట్రంలో చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్(ప్రత్యేకావసరాలు గల చిన్నారుల) వివరాలు విద్యాశాఖ సేకరించింది. 72వేల మందిలో 21వేల మంది అభ్యసన వైకల్యంతో బాధపడుతున్నట్టు విద్యాశాఖ గుర్తించింది. ఆ తర్వాత కంటిచూపుతో బాధపడుతున్న విద్యార్థులు ఉన్నారు. తరగతులవారీగా పరిశీలిస్తే 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఒకశాతానికి పైగా విద్యార్థులు వైకల్యం సమస్యతో బాధపడుతున్నారు. మిగిలిన తరగతుల్లో మాత్రం వైకల్యంతో బాధపడుతున్నవారు ఒకశాతం లోపే ఉన్నారు. 4, 7వ తరగతుల్లో అత్యధికంగా 1.24% విద్యార్థులు వైకల్యంతో సతమతమవుతున్నారు. రాష్ట్రంలో పుట్టుకతో ఏదో వైకల్యం గల చిన్నారుల సంఖ్య ఏటేటా పెరుగుతుండటం ఆందోళనకరం. ఈ ఐదేండ్ల కాలంలో వైకల్యం గల విద్యార్థుల సంఖ్య 50% పెరిగింది. 2020-21లో ప్రత్యేకావసరాలు గల విద్యార్థుల సంఖ్య 32,987 మాత్రమే. 2023-24లో 67,024కు చేరింది. 2024-25కు వచ్చేసరికి ఈ సంఖ్య 72వేలు దాటింది.
ఇంకా సౌకర్యాల లేమి..
రాష్ట్రంలో వైకల్యంతో బాధపడుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది. వీరికి విద్యనందించే వసతులు మాత్రమే పెరుగడం లేదు. బడుల్లో ఇంకా సౌకర్యాల లేమి పట్టిపీడిస్తున్నది. సమగ్ర శిక్షా పథకం ద్వారా భవిత సెంటర్లను నడుపుతున్నా.. కొన్ని బడుల్లో ఇంకా వసతుల కల్పన జరుగడంలేదు. రాష్ట్రంలో ప్రత్యేక ఉపాధ్యాయులున్న స్కూళ్లు 5.53 శాతమే ఉన్నాయి. రాష్ట్రంలో అన్ని రకాల బడులు కలిపి 43వేలుంటే. 2,388 బడుల్లో మాత్రమే ప్రత్యేక విద్య బోధించగల టీచర్లు ఉన్నారు. ప్రత్యేక ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగించే అంశం. అన్ని పాఠశాలల్లో మెట్లకు బదులు ర్యాంపులు ఏర్పాటు చేయాలని విద్యాశాఖ ఆదేశాలున్నాయి. ఇప్పటికీ 23% బడుల్లో ర్యాంపుల్లేవు. ప్రత్యేకావసరాలు గల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా టాయిలెట్లు నిర్మించాలి. స్టూడెంట్ ఫ్రెండ్లీ టాయిలెట్లు నిర్మించాల్సి ఉంది. ఇప్పటివరకు 3,216(7.45%) బడుల్లో మాత్రమే ఇలాంటి వసతులున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ కలిపితే 3.58 లక్షల మంది టీచర్లుండగా కేవలం 14.34% టీచర్లు మాత్రమే ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్‌పై శిక్షణ పొందారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రాథమిక బడుల్లో ప్రతి 10 మందికి, ఉన్నత పాఠశాలల్లో ప్రతి 15 మంది విద్యార్థులకు ఒక టీచర్ చొప్పున నియమించాలి. రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ వెయ్యి మంది స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామకం చేపట్టింది. ఆ తర్వాత ఈ విషయం అటకెక్కింది.
వైకల్యంతో బాధపడుతున్న విద్యార్థులు
వైకల్యం విద్యార్థులు/శాతం
తరగతలువారీగా వివరాలిలా..
తరగతి వైకల్యం గల విద్యార్థుల శాతం