హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): ఒక నిమ్మకాయ కొందామంటే రూ.10 అడుగుతున్నారు. సరే పోనీ ఈ ఎండకు దూప తగ్గాలి కొందాం అనుకొంటే.. అవి కూడా దొరకటం కష్టంగా మారింది. ఈ ఎండాకాలం మార్కెట్లో నిమ్మకాయలకు అంత డిమాండ్ పెరిగిపోయింది మరి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో ఒక నిమ్మకాయ రూ.10 నుంచి రూ.15 పలుకుతున్నది. గుజరాత్లో రూ.25 వరకు ఉన్నది. ఘజియాబాద్ హోల్‌సేల్ కూరగాయల మారెట్లో నిమ్మకాయలు కిలో రూ.350కి అమ్ముతున్నారు. జోధ్‌పూర్‌లో కిలో రూ.400కి చేరుకొన్నది. ఇంతకుముందు నిమ్మకాయల బస్తా రూ.700కి కొంటే, ఇప్పుడు రూ.3,500గా ఉన్నది. నిమ్మ ధరలు పులుపెక్కడానికి కారణం ఏంటంటే.. నిమ్మకాయలు పండించే ప్రాంతాల్లో ఈ ఏడాది విపరీతమైన వేడి ఉండటమే.
నిమ్మకాయల ఉత్పత్తికి పేరున్న ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్లో ఈ సీజన్లో ఎన్నడూలేని విధంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. దీంతో దిగుబడి తగ్గింది. ఈ రాష్ర్టాలపై తుఫాను కూడా ప్రభావం చూపటంతో పంట దెబ్బతిన్నది. పెట్రోల్, డీజిల్ ధరలు కూడా నిమ్మ రేటు ఎక్కవ కావటానికి మరో కారణమని మార్కెట్ నిపుణులు అంటున్నారు. నిమ్మకాయలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రవాణా చేయటానికి ఎక్కువ ఖర్చు అవుతుండటంతో, అమ్మకందారులు కూడా వాటి రేట్లను పెంచేస్తున్నారని చెప్తున్నారు. సరఫరా తగ్గటం, డిమాండ్ పెరగటంతో రేట్లు పెంచుతున్నారని వివరిస్తున్నారు. దేశంలో ఏటా 3,516.72 టన్నుల నిమ్మకాయలు ఉత్పత్తి అవుతాయి. వీటిని దేశీయంగానే వినియోగిస్తారు. మనకు నిమ్మకాయల ఎగుమతి, దిగుమతి లేదు. ప్రపంచంలో నిమ్మకాయల ఉత్పత్తిలో భారతదేశానిదే అగ్రస్థానం.