నిజామాబాద్ క్రైం,ఏప్రిల్ 20 : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో చార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలి ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన జిల్లా కేంద్రంలో బుధవారం తెల్లవారు జామున చోటు చేసుకున్నది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని కంఠేశ్వర్ ఎస్బీఐ బ్యాంక్ ప్రాంతంలో నివాసం ఉండే కళ్యాణ్ రోజులాగే ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీని మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఇంట్లోని హాలులో చార్జింగ్ పెట్టాడు.
అనంతరం తాత రామస్వామి(80), నాన్నమ్మ కమలమ్మతో కలిసి అదే హాల్లో పడుకున్నాడు. మరో గదిలో రామస్వామి కుమారుడు ప్రకాశ్, కోడలు కృష్ణవేణి పడుకున్నారు. బుధవారం తెల్లవారుజామున బ్యాటరీ భారీ శబ్ధంతో పేలిపోయింది. శబ్ధానికి గదిలో నిద్రిస్తున్న ప్రకాశ్, కృష్ణవేణి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చారు. అంతలోనే బ్యాటరీలోని కెమికల్ హాల్లో వ్యాపించి దాని ద్వారా మంటలు రామస్వామి, కమలమ్మ, కళ్యాణ్‌కు అంటుకున్నాయి. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించిన కృష్ణవేణికి సైతం గాయాలయ్యాయి.
ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన రామస్వామిని ఆయన కుమారుడు ప్రకాష్ చికిత్స నిమిత్తం కారులో నగరంలోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించాడు. అప్పటికే పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ దవాఖాన మార్చురీకి తరలించారు.
గాయాలపాలైన కమలమ్మ, కళ్యాణ్, కృష్ణవేణిని చికిత్స నిమిత్తం ప్రైవేటు దవాఖానలో చేర్పించారు. సంఘటనా స్థలాన్ని త్రీ టౌన్ ఎస్సై సాయినాథ్ పరిశీలించారు. అనంతరం ప్రకాశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.