వాజేడు, జూన్ 3: వంట చెరుకు కోసం కొంగాల అడవికి వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు మందుపాతరపై కాలు పెట్టడంతో పేలి మృతి చెందాడు. ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన ఇల్ల్లెందుల ఏసు(55) ఇల్ల్లెందుల ఏసు, రమేశ్, ఫకీర్, పాల్గుణ, అరికిల్ల లక్ష్మయ్య సోమవారం తెల్లవారుజామున వంట చెరుకుకోసం కొంగాల గుట్టపైకి వెళ్లారు.
ఈ క్రమంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర (ప్రెషర్బాంబు)పై ఇల్లందుల ఏసు కాలు వేశాడు. అది ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలడంతో ఏసు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనతోపాటు ఉన్న వారిలో ఇద్దరు స్వల్పంగా గాయపడగా, మరో ఇద్దరు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. వెంటనే గ్రామంలోకి వెళ్లి విషయం చెప్పి పోలీసులకు సమాచారం అందించారు.
ఏసు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఏటూరునాగారం వైద్యశాలకు తరలించి అనంతరం జగన్నాథపురం తీసుకొచ్చారు. దీంతో జగన్నాథపురం గ్రామంలో విషాదఛాయలు ఆలుముకున్నాయి. ఎస్పీ శబరీష్ ఏటూరునాగారం సామాజిక వైద్యశాలలో ఏసు కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.