సంగెం, జూలై 21: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కోటి ఎకరాలకు నీరందిస్తున్నామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. 44 వేల చెరువులను మిషన్ కాకతీయ ద్వారా మరమ్మతులు చేసి భూగర్భ జలాలను వృద్ధి చేసుకొన్నామని తెలిపారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని పేర్కొన్నారు. గురువారం వరంగల్ జిల్లా సంగెం మండలంలోని కాపులకనపర్తి సొసైటీలో రూ. 19 కోట్ల పంట రుణాలను రైతులకు అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. సహకార సంఘాల బలోపేతానికి రైతులు సహకరించాలని కోరారు. తెలంగాణ వస్తే ఏమొస్తది అన్న వాళ్లకు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే సమాధానమన్నారు. తెలంగాణ వస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకొంటారని ఎద్దేవా చేశారని, 24 గంటల కరెంటు, రైతుబందు, రైతుబీమా, ఆసరా పింఛన్లు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు.