Caste Census | హైదరాబాద్, ఫిబ్రవరి3 (నమస్తే తెలంగాణ): బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీల్లోని కులాలవారీగా జనాభా వివరాలు తేలుస్తారా? ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నా యి. ఏ కులం అధికంగా రాజకీయ అవకాశాలను పొందింది? ఏ కులం తక్కు వ అవకాశాలను పొందింది? వంటి సమగ్ర సర్వేలో పొందుపర్చిన వివరాలను బహిర్గతం చేస్తారా? లేక ఇప్పటికే చెప్పిన లెక్కలనే అసెంబ్లీలో ప్రకటించి సర్కారు చేతులు దులుపుకుంటుందా? అన్న అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా బీసీ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఇప్పటికే ప్రభుత్వం స్థూలంగా వెల్లడించిన గణాంకాలపై అన్నివర్గాల్లో అసంతృప్తితోపాటు, అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గణాంకాలన్నీ అసంబద్ధంగా ఉన్నాయని సామాజిక వేత్తలు, బీసీ మేధావుల చెప్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రణాళిక శాఖ నవంబర్లో ఇంటింటి సర్వే (సామాజిక, ఆర్థిక, విద్యా,ఉద్యోగ, రాజకీయ, కుల) నిర్వహించింది.
ప్రభుత్వం తేల్చిన వివరాలు ఇవే
రాష్ట్రంలో మొత్తం జనాభా 3.70 కోట్ల మంది అని తేల్చి చెప్పింది. వారి లో 16 లక్షల మంది (3.1%) సర్వేలో పాల్గొనలేదని, మిగతా 3.54 కోట్ల మంది వివరాలను సేకరించినట్టు నివేదించారు. అందులో స్థూలంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ వర్గాల జనాభా లెక్కలను తేల్చారు. బీసీ జనాభా 46.25%, ముస్లిం బీసీలు 10.08%, ఓసీ 15.79%, ఎస్టీలను 10.45%గా నిర్ధారించింది. ఈ మేరకు మంగళవారం ఈ నివేదికపై అసెంబ్లీలో చర్చ జరగనున్నది.