హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల గౌరవ వేతనాల పెంపు గగనంగా మారేది. ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు చేస్తే తప్ప ప్రభుత్వాలు స్పందించేవి కావు. ఒక్కోసారి కార్మికులు సమ్మెకు సైతం దిగేవారు. అయినా ప్రభుత్వాలు కనికరించకపోయేవి. దీంతో కార్మికులు చాలీచాలని జీతాలతోనే కుటుంబాలను పోషించుకొనే వారు. కానీ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిస్థితి మారింది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పారిశుద్ధ్య కార్మికుల కష్టాలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ స్థితిగతులను తెలుసుకొని మానవీయ కోణంలో ఆలోచించి వారి వేతనాలు రెండుసార్లు పెంచారు. 2015 వరకు జీహెచ్ఎంసీ మినహా ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కార్మికుల గౌరవ వేతనం రూ.9,649 ఉండగా.. 2017లో రూ.13,950లకు పెంచారు. ప్రస్తుతం 30 శాతం పెంచి ఆ మొత్తాన్ని రూ.18,057 చేశారు. దీంతో ఏడేండ్ల కాలంలో కార్మికుల వేతనాలు 87 శాతం పెరిగాయి. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్దమొత్తంలో పారిశుద్ధ్య కార్మికులకు గౌరవ వేతనాలు పెంచిన చరిత్ర లేదు.
సీఎం కేసీఆర్ నిర్ణయంతో మున్సిపల్ శాఖలోని 22,533 మంది పబ్లిక్‌హెల్త్ వర్కర్లు, 7,271 మంది పారిశుద్ధ్య కార్మికులకు లబ్ధిచేకూరనున్నది. గత సంవత్సరం జూన్ నుంచి పెరిగిన వేతనాలు అమల్లోకి రానున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలుచేసినప్పుడు గతంలో ఏ ప్రభుత్వం కూడా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల గౌరవవేతనాలు పెంచలేదు. కానీ, రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ప్రతి ఉద్యోగికి సీఎం కేసీఆర్ వేతనాలు పెంచారు. గౌరవ వేతనాలే కాకుండా పీఎఫ్, ఈఎస్ఐ కూడా అమలు చేస్తున్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తినవారికి చికిత్స అందించటానికి హెల్త్‌కార్డులు, యూనిఫాంలు, ప్రత్యేక కిట్లు కూడా అందిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో మున్సిపల్ కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తూ కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్నారు.
మానవీయ పాలనకు నిదర్శనం..
22,533 మంది పబ్లిక్‌హెల్త్ వర్కర్లు, 7,271 మంది పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం 30 శాతం గౌరవ వేతనాలు పెంచడం ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు మానవీయ పాలనకు తార్కాణం. నిత్యం ప్రజారోగ్య రక్షణకు విధులు నిర్వర్తించే ఉద్యోగులకు ఇది సముచిత గౌరవం.
దేశంలో ఎక్కడా లేని విధంగా..
దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చిన విధంగానే ము న్సిపల్ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికుల గౌరవ వేతనం 30% పెంచారు. ఈ నిర్ణయంతో కార్మికులంతా సంతోషంగా ఉన్నారు. కార్మికుల వేతనాలు రెండుసార్లు పెరిగాయి. సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు.
కేసీఆర్ సారు సల్లగుండాలి
మాకు వేతనాలు పెంచిన సీఎం కేసీఆర్ సార్ సల్లగుండాలి. జీతాలు పెంచి కార్మికులందరూ కడుపునిండా భోజనం చేయడానికి అవకాశం ఇచ్చారు. ఏడేండ్లలో మాకు శాలరీలు డబుల్ అయ్యాయి. గతంలో ఎవ్వరు కూడా మా గురించి ఇంత ఆలోచించలేదు. కేసీఆర్ వచ్చినంకనే మా కష్టాలు తీరుతాన్నయి.
సారుకు మా కష్టం తెలుసు
మా గురించి కేసీఆర్ సారుకు తెలుసుకాబట్టే వేతనాలు పెంచారు. మా కష్టం తెలుసు, మా ఆరోగ్యాలు, మా పిల్లల గురించే ఆలోచించి ఆ విధంగా చేశారు. గతంలో జీతాలు పెంచమని ఎన్నోసార్లు అడిగినా పెంచకపోయేది. ఇప్పుడు అట్ల లేదు. కేసీఆర్ సారే ఆలోచించి జీతాలు పెంచుతార్రు.