ఆదిలాబాద్, సెప్టెంబర్29 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లాలోని మహారాష్ట్ర సరిహద్దులో పెన్‌గంగపై నిర్మిస్తున్న చనాక- కొరాట ప్రాజెక్టు వెట్‌రన్‌ను అధికారులు రెండో రోజైన శుక్రవారం విజయవంతంగా నిర్వహించారు. ఎత్తిపోతల ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి పర్యవేక్షణలో ప్రాజెక్టు సీఈ శ్రీనివాస్, ఈఈ రవీందర్, డీఈ తులసీరాం, ట్రాన్స్‌కో అధికారులు వెట్‌రన్ చేపట్టారు. 0.8 టీఎంసీలు నీటి నిల్వచేసే ప్రాజెక్టు బరాజ్, నీటిని ఎత్తిపోసేందుకు నిర్మించిన పంప్‌హౌస్ పనులు పూర్తయ్యాయి. పంప్‌హౌస్‌లో 5.5 మెగావాట్ల సామర్థ్యం గల మూడు మోటర్లు, 12 మెగావాట్ల సామర్థ్యం గల మరో 3 మోటర్లను ఏర్పాటు చేశారు. రెండ్రోజులుగా 5.5 మెగావాట్ల ఒక మోటర్ ద్వారా 42 మీటర్ల మేర నీటిని ఎత్తిపోస్తుండగా 350 క్యూసెక్కుల నీరు వస్తున్నదని అధికారులు తెలిపారు.
చనాక- కొరాట ప్రాజెక్టు వెట్‌రన్‌ను విజయవంతంగా నిర్వహించాం. తక్కువ ఖర్చుతో పంప్‌హౌస్ నుంచి నీటిని కాలువల్లోకి ఎత్తిపోస్తున్నాం. దుమ్ముగూడెం నుంచి తీసుకువచ్చిన 5.5 మెగావాట్ల మోటర్లను వినియోగిస్తున్నాం. ఇవి 75 మీటర్ల ఎత్తు వరకు నీటిని ఎత్తిపోయగలవు. ఇక్కడ 42 మీటర్ల వరకు మాత్రమే అవసరమవుతుండగా డిశ్చార్జ్ ఎక్కువగా వస్తున్నది. ఈ ప్రాజెక్టు ఆదిలాబాద్ జిల్లా రైతులకు వరమని చెప్పవచ్చు.
– పెంటారెడ్డి, ఎత్తిపోతల ప్రభుత్వ సలహాదారు