Telangana | హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): ఒకవైపు నిరుద్యోగుల పోరుబాట.. సుప్రీంకోర్టులో న్యాయపోరాటం.. సోమవారమే అభ్యర్థుల పిటిషన్‌పై విచారణ.. మరోవైపు పోలీసుల ఉక్కుపాదం.. అభ్యర్థులపై సర్కారు పంతం.. ఈ నేపథ్యంలో సోమవారమే ప్రారంభంకానున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు.. దీంతో నిరుద్యోగ యువత రగిలిపోతున్నది. ప్రభుత్వ దమననీతిపై మండిపడుతున్నది. సర్కారు మొండివైఖరిపై భగ్గుమంటున్నది. పోలీసుల లాఠీ దెబ్బలకు జంకకుండా ఎదురొడ్డి పోరాడుతున్నది. ఈ పరిస్థితుల్లో గ్రూప్-1 పరీక్షలు సజావుగా సాగేనా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. పరీక్షలు జరగుతాయా? లేదోనన్న టెన్షన్ అభ్యర్థులను పీడిస్తున్నది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. అయితే జీవో-29పై అభ్యర్థులు వేసిన పిటిషన్‌పై సోమవారమే విచారణ జరగనున్నది.
సోమవారం ఉదయం సుప్రీంకోర్టులో గ్రూప్ -1పై విచారణ జరగనుండగా, మరోవైపు సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి గ్రూప్-1 పరీక్షలు పరీక్షలు ప్రారంభంకానున్నాయి. సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందోనన్న ఉత్కంఠ అభ్యర్థుల్లో నెలకొన్నది. జీవో-29ని రద్దు చేయాలని, గ్రూప్-1 మెయిన్స్‌ను వాయిదా వేయాలని, ప్రిలిమ్స్ ఫలితాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను పాటించాలని, అభ్యర్థులకు వచ్చిన మార్కుల వివరాలను వెల్లడించాలని, ప్రామాణిక పుస్తకాలపై స్పష్టత ఇవ్వాలన్న డిమాండ్లతో నిరుద్యోగులు గత కొంతకాలంగా పోరాడుతున్నారు. ఇంతకాలం న్యాయపోరాటం చేసిన అభ్యర్థులు తాజాగా ప్రత్యక్ష్య పోరుకు దిగారు. ఎంతగా అణిచివేస్తున్నా.. అభ్యర్థులు తెగించి పోరాడుతున్నారు.
అధికార మత్తులో అణచివేత
గతంలో ఎక్కడ నిరుద్యోగులు ఆందోళన చేస్తే అక్కడ వాలిపోయే కాంగ్రెస్ నేతలు.. ఇప్పు డు అదే నిరుద్యోగులు రోడ్డెక్కినా, ఆందోళన నిర్వహించినా అధికార మత్తులో అణచివేత చ ర్యలకు దిగుతున్నారు. 10 నెలల పాలనలో కాంగ్రెస్ సర్కారు మోసాన్ని గ్రహించిన నిరుద్యోగలోకం ఇప్పుడు ప్రత్యక్ష ఆందోళనకు దిగింది. ‘మా కారణంగా మీకు ఉద్యోగాలొచ్చాయి.. మా ఉద్యోగాల సంగతేంటి?’ అంటూ ఎక్కడిక్కడ నిరుద్యోగులు పాలకులను నిలదీస్తున్నారు. గెలిచిన తెల్లారే అశోక్‌నగర్‌కు వస్తా, మీ సమస్యలు పరిష్కారిస్తా.. అన్న రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఎందు కు రావడంలేదని ప్రశ్నిస్తున్నారు. నిరుద్యోగులను రోడ్డెక్కించిన నేతల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా ఇప్పుడు నోరేత్తడంలేదని నిరుద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మొండిగా పరీక్షల నిర్వహణకే ఏర్పాట్లు చేస్తున్నదని మండిపడుతున్నారు.
పోలీసు పహారాలో..
రాష్ట్ర ప్రభుత్వం పోలీసు పహారాలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. నిరుద్యోగుల ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నది. ఒక్కో సెంటర్లో ఒక పోలీసు అధికారికి బందోబస్తు బాధ్యతలను అప్పగించింది. ఇప్పటికే ఇన్స్పెక్టర్, ఎస్ఐలకు పరీక్షా కేంద్రాల్లో డ్యూటీలను కేటాయించారు. గ్రూప్-1 మెయిన్స్‌లో సోమవారం క్వాలిఫైయింగ్ పేపర్ అయిన జనరల్ ఇంగ్లిష్తో పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ నెల 27 వరకు పరీక్షలు జరుగుతాయి.