హైదరాబాద్, జూన్1 (నమస్తే తెలంగాణ): రైతు రుణమాఫీ, రైతు భరోసాకు ఆశించిన మైలేజీ రాలేదని ముఖ్యమంత్రి, మంత్రులు అంతర్మథనం చెందుతున్నట్టు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నదని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ప్రత్యేకంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ముఖ్యనేతలతో సమావేశం కావడం, ప్రభుత్వం, మంత్రుల పనితీరుపై వివరాలు సేకరిస్తుండటంపై చర్చించినట్టు తెలిసింది. పలువురు మంత్రుల వ్యక్తిగత వ్యవహారాలు, వాటి పర్యవసానాలపైనా వాడివేడిగా చర్చ సాగినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. కొందరు మంత్రుల పనితీరు బాగాలేదని, మెరుగుపడాల్సిందేనని సీఎం స్పష్టం చేసినట్టు సమాచారం.
అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని హెచ్చరించినట్టు తెలిసింది. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడంలో చాలా వెనుబడ్డామని,అందరూ సమాన బాధ్యత తీసుకోవాలని మంత్రులకు సూచించినట్టు చెప్పుకుంటున్నారు. ఇక ఉద్యోగుల నుంచి ప్రభుత్వానికి సహకారం తగ్గుతున్నదని, రెండు డీఏలు ఇస్తే బాగుంటుందని సూచించగా, క్యాబినెట్లో నిర్ణయం తీసుకుందామని చెప్పినట్టు తెలిసింది. ఈ నెల 5వ తేదీన క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర అవతరణ వేడుకలు, ఇందిరమ్మ ఇండ్లు, రెవెన్యూ సదస్సులు, వానకాలం సాగు సన్నద్ధత, రాజీవ్ యువ వికాసంపై మంత్రులు అందించిన నివేదికపైనా సమావేశంలో చర్చించారు. అనర్హులకు రాజీవ్ యువ వికాసం అందకుండా చూడాలని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పూర్తిస్థాయి పరిశీలన తరువాతే అర్హుల జాబితాలను ప్రకటించాలని, ఈ అంశంపై క్యాబినెట్లో చర్చించాలని నిర్ణయించారు. రాష్ట్ర అవతరణ వేడుకలను పురస్కరించుకుని ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
4న ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి?
సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 4న ఢిల్లీకి వెళ్లనున్నట్టు తెలిసింది. మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానంతో కీలక చర్చలు జరిపే అవకాశం ఉన్నదని సమాచారం. ఢిల్లీ పెద్దలు సూచించిన జాబితాకు సీఎం ఆమోదం తెలిపిన నేపథ్యంలో, మంత్రివర్గ విస్తరణపై 4న ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నదని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. మరోవైపు ఇప్పుడున్న మంత్రుల శాఖల మార్పుపైనా నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం. మంత్రుల తొలగింపుపై అధిష్ఠానం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదని తెలిసింది.