హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): అనుబంధ క్రికెట్ అసోసియేషన్లకు ప్రతి ఏడాదికీ రూ.3 లక్షల చొప్పున నిధులు విడుదల చేయాలంటూ అంబుడ్స్‌మెన్ జారీచేసిన ఆదేశాలను తప్పనిసరిగా అమలుచేయాలని తెలంగాణ హైకోర్టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)కు స్పష్టం చేసింది. 2017-18 నుంచి 2025-26 వరకు తొమ్మిది ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన మొత్తంగా రూ.27 లక్షలను పిటిషనర్‌కు ఎనిమిది వారాల్లో చెల్లించాలని ఆదేశించింది. అంబుడ్స్‌మెన్ ఉత్తర్వుల ప్రకారం నిధులు విడుదల చేయకుండా హెచ్‌సీఏ వ్యవహరించడాన్ని సవాలు చేస్తూ మహమూద్ క్రికెట్ క్లబ్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ నగేశ్ భీమపాక విచారించారు.
ఈ సందర్భంగా అంబుడ్స్‌మెన్ జారీచేసిన ఆదేశాలకు హెచ్‌సీఏ కట్టుబడి ఉండాల్సిన బాధ్యత ఉందని న్యాయమూర్తి పేరొన్నారు. ఒక ప్రైవేట్ వాణిజ్య సంస్థకు రూ.68 కోట్ల నిధులను పంపిణీ చేయగలిగిన హెచ్‌సీఏ, అదే సమయంలో అనుబంధ క్రికెట్ క్లబ్‌లకు సంవత్సరానికి కేవలం రూ.3 లక్షల చొప్పున ఇవ్వాల్సిన నిధులను ఎందుకు నిలిపివేసిందని ప్రశ్నించారు. అంబుడ్స్‌మెన్ ఉత్తర్వుల అమలును నిర్లక్ష్యం చేయడానికి సరైన కారణాలు కనిపించడం లేదని అన్నారు. దీంతో అంబుడ్స్‌మెన్ ఆదేశాల మేరకు మహమూద్ క్రికెట్ క్లబ్‌కు బకాయి నిధులను ఎనిమిది వారాల్లో విడుదల చేయాలని ఆదేశిస్తూ విచారణను ముగించారు.