Telangana | మంచానికి పరిమితమైన వృద్ధురాలిని ఆమె కాల్చిన బీడే దహించి వేసింది. బీడీకి ఉన్న నిప్పు దుప్పటికి అంటుకుని మంటలు చెలరేగడంతో అందులోనే సజీవ దహనమైంది. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం శ్రీనివాస్ నగర్లో ఆదివారం ఈ విషాదం చోటు చేసుకుంది.
మానకొండూర్ మండలం శ్రీనివాస్‌నగర్‌లో తన కోడలు బొడ్డు ఎల్లవ్వతో బొడ్డు పోచమ్మ (90) ఉంటుంది. గత కొంతకాలంగా అనారోగ్యానికి గురై కాలు విరిగి మంచానికే పరిమితమైంది. ఆమెకు చుట్ట, బీడీలు తాగే అలవాటు ఉంది. రోజూలాగే ఆదివారం మధ్యాహ్నం బీడీ తాగి అలాగే మంచంపై పడుకుంది. అయితే ఆ బీడీ మంచంలోనే పడిపోవడంతో దాని నిప్పు చెలరేగి బట్టలకు, అలాగే మంచానికి అల్లుకున్న ప్లాస్టిక్ నమారుకు అంటుకున్నాయి.అయితే కాలు విరిగి మంచంలో నుంచి లేచే పరిస్థితి లేకపోవడంతో బొడ్డు పోచమ్మ అందులోనే ఉండి అరుస్తూ ఉండిపోయింది. చాలాసేపటికి ఆమె అరుపులు విన్న చుట్టుపక్కల వాళ్లు 108 సిబ్బందికి సమాచారం అందించారు. అనంతరం కరీంనగర్ ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం వరంగల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించింది.