Ration Cards | కోటపల్లి, మే 9 : రేషన్ కార్డులో తన పేరు తొలగించగా, తిరిగి నమోదు చేయించుకునేందుకు వచ్చిన ఓ వృద్ధుడు ఎంపీడీవో కార్యాలయం ఎదుటే గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కోటపల్లిలో శుక్రవారం చోటుచేసుకున్నది.
సూపాక గ్రామానికి చెందిన నల్లగుంట మల్లయ్య (60) కుటుంబానికి రేషన్ కార్డు ఉన్నది. ఇటీవల ఆ కార్డులో నుంచి మల్లయ్య పేరు తొలగించారు. తన పేరును తిరిగి నమోదు చేయించుకునేందుకు నాలుగైదు రోజులుగా మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయానికి వచ్చివెళ్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం కూడా సూపాక గ్రామం నుంచి ఆర్టీసీ బస్సులో కోటపల్లికి వచ్చాడు. ఎంపీడీవో కార్యాలయం ముందున్న బల్లపై కూర్చుండగా, గుండెపోటుతో అక్కడే మరణించాడు. స్థానికులు చూసి అతడి బంధువులకు సమాచారం అందించారు. మల్లయ్య మృతదేహాన్ని చెన్నూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.