Narayanapet | మక్తల్, నవంబర్ 19 : కుళ్లిన కూరగాయలు రోడ్డుపై వేస్తున్నావు.. రూ.200 ఫైన్ కట్టాలని మున్సిపల్ అధికారులు నోటీసు అందించగా.. గుండెపోటుతో వృద్ధురాలు మృతి చెందిన ఘటన నారాయణపేట జిల్లాలో చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాలు.. మక్తల్ మున్సిపల్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ప్రధాన రహదారి పకన బాలమ్మ అనే మహిళ కొన్నేండ్లుగా కూరగాయలు అమ్ముతూ జీవిస్తున్నది. అయితే కుళ్లిన, మిగిలిన కూరగాయలను రోడ్డుపై పడేస్తుండడంతో మున్సిపల్ కమిషనర్ భోగేశ్వర్, కార్యాలయ సహాయకుడు విధించిన రూ.200 ఫైన్ నోటీసును మంగళవారం ఉదయం సదరు వ్యాపారికి సిబ్బంది అందించారు. మళ్లీ చెత్త వేస్తే రూ.10 వేలు జరిమానా వేస్తామని హెచ్చరించారు. అధికారుల మాటలు విన్న వృద్ధురాలు ఒకసారిగా కూరగాయలు అమ్మే చోటే పడిపోయింది. స్థానికులు మక్తల్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే గుండెపోటుతో మృతిచెందిందని వైద్యులు నిర్ధారించారు.