Elevated Corridor | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 7 (నమస్తే తెలంగాణ): ప్యాట్నీ- తూంకుంట మధ్య కారిడార్‌లో మెట్రో ప్రస్తావన లేకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రాజెక్టు స్వరూపం ఎలా ఉంటుందో తెలియకుండానే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కారిడార్‌కు శంకుస్థాపన చేశారా? అంటూ మండిపడుతున్నారు. ప్రచారానికి అధిక ప్రాధాన్యమిస్తూ.. ప్రజా ప్రయోజనాలను విస్మరిస్తున్నారని మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులు విమర్శించారు. గత ఐదు దశాబ్దాలుగా రక్షణశాఖతో ఉన్న భూ తగాదాలను పరిష్కరించానని చెప్పుకుంటున్న సీఎం బహుళ ప్రయోజనాలను ఎందుకు మరిచిపోయారని మండిపడుతున్నారు. అల్వాల్‌లోని టిమ్స్ ప్రాంగణంలో సీఎం కారిడార్‌కు శంకుస్థాపన చేస్తున్న సమయంలో ఆందోళనకారులు మెట్రో విస్తరణపై నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ‘వుయ్ డిమాండ్ మేడ్చల్ మెట్రో’ అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు.
హెచ్ఎండీఏ అధికారులు ప్రదర్శించిన ప్రాజెక్టు వివరాలపై సాధన సమితి సభ్యులు మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టుతో భవిష్యత్తులో మెట్రో విస్తరణ సాధ్యపడదని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రోడ్డు కారిడార్‌తోపాటు మెట్రో రైలు కూడా ప్రయాణించేందుకు వీలుగా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లను ప్రతిపాదించిందని వారు గుర్తు చేశారు. ఉత్తర తెలంగాణతోపాటు, ఓఆర్ఆర్ సమీపంలో ఉన్న ఫార్మా క్లస్టర్ జీనోమ్ వ్యాలీ వరకు మెరుగైన రవాణా సదుపాయాలను సమకూర్చడంలో.. ఎలివేటెడ్ కారిడార్ అత్యంత కీలకం కానుంది. నగరానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓఆర్ఆర్ అవతలి వరకు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా ప్రయాణించేందుకు ఈ మార్గం దోహదపడనుంది. భవిష్యత్తులో శామీర్‌పేట్ వరకు మెట్రో రైలును విస్తరించనున్న నేపథ్యంలో ఈ కారిడార్‌పైనే మెట్రో మార్గాన్నికూడా నిర్మించాలని కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ రేవంత్‌రెడ్డి పాత ప్రతిపాదనలేవీ పరిగణనలోకి తీసుకోకుండానే.. ఎలివేటెడ్ కారిడార్ పేరిట ఫ్లైఓవర్ నిర్మించి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని ఆందోళనకారులు మండిపడ్డారు. పాత ప్రతిపాదనలను పక్కన పెట్టేయడంతో హైదరాబాద్ నార్త్‌జోన్ ప్రజలకు తీరని నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో రూపొందించిన ప్రతిపాదనల ప్రకారమే భూ సేకరణ, డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.