హైదరాబాద్, మే 31(నమస్తే తెలంగాణ): ఆయిల్‌పామ్ రైతులకు కేంద్రం షాకిచ్చింది. సుంకం తగ్గింపు రూపంలో వారి నెత్తిన పిడుగు వేసింది. ప్రస్తుతం 27.5 శాతంగా ఉన్న ముడి పామాయిల్ దిగుమతి సుంకాన్ని 10 శాతం తగ్గించింది. ఫలితంగా దేశంలోకి పామాయిల్‌తో పాటు ఇతర నూనెల దిగుమతులు పెరిగి, స్థానిక రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నదని ఉద్యాన నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రైతుల ఇబ్బందులను పట్టించుకోకుండా సుంకాలను తగ్గించడంపై మండిపడుతున్నారు. క్రూడాయిల్ దిగుమతులపై గతంలో 5 శాతం సుంకం మాత్రమే ఉండటంతో దేశీయ ఆయిల్‌పామ్ రైతులు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. దీంతో సుంకం పెంచాల్సిందేనంటూ రైతులతోపాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చాయి. దీంతో దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం ఆరు నెలల క్రితం సుంకాన్ని 5శాతం నుంచి 27.5 శాతానికి పెంచింది. తాజాగా, ఇప్పుడు 10 శాతం తగ్గించి ఆయిల్‌పామ్ రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఒక రకంగా చెప్పాలంటే ఈ నిర్ణయం పామాయిల్ రైతులకు చావుదెబ్బ లాంటిదే. ఇప్పుడిప్పుడే ఆర్థికంగా పుంజుకుంటున్న రైతులకు ఇది భారీ దెబ్బ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సుంకాల తగ్గింపుతో పామాయిల్ గెలల ధర భారీగా పతనమయ్యే ప్రమాదం ఉందని ఉద్యానశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పామాయిల్ ఫ్రెష్ ఫ్రూట్ బంచ్(ఎఫ్‌ఎఫ్‌బీ) ధర టన్నుకు రూ. 20,058గా ఉన్నది. ఇది రైతులకు ఒక రకంగా మంచి ధర. అయితే ఇప్పుడు దిగుమతి సుంకాన్ని 27.5 శాతం నుంచి 17.5 శాతానికి తగ్గించడంతో ఎఫ్‌ఎఫ్‌బీ గెల ధర రూ. 16-17 వేలకు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. అంటే టన్నుకు రూ. 3-4 వేల కోత పడడం రైతులను ఆందోళనకు గురిచేస్తున్నది.
ఆయిల్‌పామ్ రైతులపై కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు పామాయిల్ ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో ‘మిషన్ ఆయిల్‌పామ్’ పేరుతో ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తున్నది. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహిస్తున్నది. వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్ సాగు చేయడం వల్ల అధిక ఆదాయం పొందవచ్చనే అవగాహనను రైతుల్లో కల్పిస్తున్నది. ఇందులో భాగంగానే ‘మిషన్ ఆయిల్‌పామ్’లో భాగంగా రాష్ట్రంలో 2.43 లక్షల ఎకరాలకు ఆయిల్‌పామ్ సాగు విస్తరించింది. ఈ పరిస్థితుల్లో కేంద్రం తీసుకున్న నిర్ణయం రైతులను ఆందోళనకు గురిచేస్తున్నది. క్రూడ్ ఆయిల్ దిగుమతులపై సుంకాన్ని తగ్గించడంతో వినియోగదారులకు స్వల్ప ఊరట లభించనుంది. ఇందులో భాగంగానే పామాయిల్ లీటర్ ప్యాకెట్‌పై రూ. 8 వరకు, సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్‌పై రూ. 10 వరకు ధర తగ్గే అవకాశం ఉన్నది.
ముడి పామాయిల్‌పై కేంద్ర ప్రభుత్వం సుంకం తగ్గించడాన్ని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తప్పుబట్టారు. కేంద్రం నిర్ణయం రైతులను తీవ్రంగా నష్టపరుస్తుందని చెప్పారు. సుంకాన్ని 40 శాతానికి పెంచాలని తాము డిమాండ్ చేస్తుంటే, కేంద్రం మాత్రం అందుకు విరుద్ధంగా సుంకాన్ని తగ్గించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.