మంథని, జూన్ 1: రైతుల ఆర్థిక స్వావలంబనే ధ్యేయంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఐదేండ్ల కింద బీఆర్ఎస్ ప్రభుత్వం రాయితీ, ప్రోత్సాహం అందిస్తూ విరివిగా ప్రోత్సహించిన ఆయిల్‌పామ్ పంటలు కోతకొస్తున్నాయి. పెద్ద గెలలతో కనిపిస్తున్న తోటలను చూస్తూ రైతన్నలు మురిసిపోతున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని డివిజన్లోని నాలుగు మండలాల పరిధిలోని వివిధ గ్రామాల్లో రైతులు 1,040 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేశారు. వారం రోజుల్లో పంట కోత ప్రారంభిస్తామని ఉద్యానశాఖ అధికారులు తెలిపారు. ప్రభుత్వం ఆయిల్‌పామ్ పంట టన్నుకు రూ.21వేల ధర నిర్ణయించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు కల్పించిందని, నేడు ఫలాలు అందుతున్నాయని రైతులు చెప్తున్నారు. ఒక్కో ఎకరానికి రూ.52,260 చొప్పున కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు చేసిందని, రూ.4,200ల చొప్పున నాలుగేండ్లపాటు సాయం అందించిందని తెలిపారు. ముందుచూపుతో పంట వేసిన తమకు 25 ఏండ్లపాటు దిగుబడి వస్తూనే ఉంటుందని సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
వారంలో పంట కట్ చేస్తాం
ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్లోని రైతు నాంసాని సమ్మయ్యకు చెందిన ఐదు ఎకరాల్లో ఆయిల్‌పామ్ కోతకు వచ్చింది. మంథని, రామగుండం డివిజన్లో 1,250 ఎకరాల్లో ఆయిల్‌పామ్ పంటలను సాగు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ఆసక్తి గల రైతులు పట్టా పాసుపుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా పాసు పుస్తకాలతోపాటు ఎకరానికి రూ.1,140 డీడీ చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.
– జ్యోతి, ఉద్యానవనశాఖ రామగుండం డివిజన్ అధికారి