న్యూఢిల్లీ, మే 2: ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఇలా ముగిసిందో లేదో అలా సామాన్యుడిపై ఎడాపెడా ధరల బాదుడు ప్రారంభమైంది. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను మోదీ ప్రభుత్వం శుక్రవారం హఠాత్తుగా రూ.993 పెంచడంతో దీని ధర రూ.3,000 దాటింది. తాజాగా నెల రోజుల వ్యవధిలోనే వంట నూనెల ధరలు కూడా భారీగా పెరిగాయి. మరింత పెరగనున్నాయి. నూనెల ధరలు సలసల మండుతుండటంతో ఆహార ధరలు కూడా పెరుగుతాయని, చివరకు ఆ భారమంతా తమపైనే పడుతుందని సామాన్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
పశ్చిమాసియా యుద్ధం కారణంగా దిగుమతి వ్యయా లు, రవాణా వ్యయాలు పెరగడంతో మార్జిన్లు బాగా తగ్గిపోవడంతో వంట నూనెల ధరలను ఆయా కంపెనీలు మరింత పెంచనున్నాయి. మార్చిలో అమలు చేసిన ధరల పెరుగుదలనే అనుసరిస్తూ మరోసారి ఆయిల్ కంపెనీలు ఏడబ్ల్యూఎల్ ఆగ్రి బిజినెస్, ఇమామి ఆగ్రోటెక్, పతంజలి ఫుడ్స్ లాంటివి 5-6% ధరలు పెంచాలని యోచిస్తున్నాయి. పశ్చిమాసియా సంక్షోభం తర్వాత చమురు ధరలు తీవ్ర ఒడిదొడుకులకు లోను కావడంతో వాటి ధరలు తీవ్ర ఎత్తుపల్లాలను చవిచూశాయి. చమురు ధరల మాదిరిగానే వంట నూనె ధరలు కూడా తీవ్రంగా ఒత్తిడికి లోనయ్యాయి.
నెలవారీ ఖర్చులపై భారం
గత నెల రోజుల్లోనే వంట నూనెల ధరలు సుమారు 22 శాతం మేర పెరిగాయి. పామాయిల్ లీటర్ ధర రూ.120 నుంచి రూ.145కు ఎగబాకింది. వేరుశనగ నూనె లీటర ధర రూ.15 పెరిగింది. రైస్ బ్రాన్, వనస్పతి, ఆవ నూనెలు కూడా రూ.15 నుంచి రూ.30 వరకు పెరిగాయి. దీంతో తిండి ఖర్చు పెరిగి సామాన్యుల నెలవారీ బడ్జెట్ పెరిగింది. వినియోగదారుల వ్యవహారాల శాఖ గణాంకాల ప్రకారం.. వంట నూనెల ప్రధాన రకాలు ప్రస్తుత అఖిల భారత సగటు చిల్లర ధరలు గత ఏడాదితో పోలిస్తే 5 నుంచి 14 శాతం పెరిగాయి. సోయాబీన్ నూనె ధర గత ఏడాదితో పోలిస్తే 8 శాతం మేర పెరిగి లీటర్‌కు రూ. 158కి చేరుకోగా, ఆవనూనె ధర 11 శాతం పెరిగి రూ. 189కు, పొద్దు తిరుగుడు నూనె ధర 14 శాతం పెరిగి రూ. 184కు చేరుకుంది.
ధరలు ఇప్పట్లో తగ్గేలా లేవు
నూనె గింజల ధరలు, ప్రపంచ సరుకు రేట్ల రవాణాలో భారీ తగ్గుదల ఏర్పడితే తప్ప వంట నూనెల ధరలు ఇప్పట్లో తగ్గే అవకాశం కన్పించడం లేదని, రానున్న కొద్ది వారాలు, నెలలు పాటు వంట నూనెల అధిక ధరల భారం సామాన్యుడు భరించక తప్పదని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా క్రూడ్ అయిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో మరింతగా పెరిగితే వంట నూనెల ధరలు కూడా ఇంకా పెరిగే పరిస్థితిని తోసిపుచ్చలేమని ఫార్చున్ బ్రాండ్ వంటనూనె సంస్థ ఎండీ, సీఈవో శ్రీకాంత్ కన్హెర్ వ్యాఖ్యానించారు. దిగుమతి వ్యయాలు భారీగా పెరిగితే అది రిటైల్ ఉత్పత్తులపై తప్పక చూపుతుందని, ఇమామి గ్రూప్ డైరెక్టర్ ఆదిత్య వీ అగర్వాల్ తెలిపారు. ప్రస్తుతం అంతర్జాతీయ పరిణామాలు జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అధిక రవాణా చార్జీలు, ఇన్సూరెన్స్, రూపాయి విలువ పతనం అంశాలు వంటనూనె ధరలపై ప్రభావం చూపుతున్నాయని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీవీ మెహతా తెలిపారు.