హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : ఒగ్గు కళాకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు ఆలోచన ఏమీ లేదని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. శాసనమండలిలో మంగళవారం ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం లేవనెత్తిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ వారి కోసం కార్పొరేషన్ ఏర్పాటు సాధ్యం కాదని స్పష్టం చేశారు. వృద్ధ ఒగ్గు కళాకారులకు ఉపాధి కల్పించే ప్రతిపాదనలు కూడా ఏవీ లేవన్నారు. 58 ఏండ్లు నిండి, అర్హులైన వారికి నెలకు రూ.3016 పింఛను మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. కనీసం 100 మందికైనా ఉపాధి కల్పించాలని మల్లేశం కోరగా దానికి ‘న్యాయం చేస్తాను.. పరిశీలిస్తాను’ అంటూ దాటవేశారు.
ట్రిపుల్ ఆర్ సౌత్ ప్రాజెక్టు డీపీఆర్లు సిద్ధం అవుతున్నాయని, త్వరలోనే కేంద్రం ఆమోదం కోసం పంపుతామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చెప్పారు. మండలిలో పలువురు కాంగ్రెస్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు బదులుగా ఆయన సమాధానం ఇచ్చారు. వచ్చే 3 నుంచి 4 ఏండ్లలో ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామన్నారు.