హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ) : s. దీంతో నాలుగు నెలలుగా వారికి నిరీక్షణ తప్పడంలేదు. 203 మంది అసిస్టెంట్ ఇంజినీర్లకు(ఏఈ), అసిస్టెంట్ డివిజినల్ ఇంజినీర్లు(ఏడీఈ)గా 2024 అక్టోబర్ 9న పదోన్నతి కల్పించారు. నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతులు కల్పించారని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది జనవరి 31న తుది తీర్పు వచ్చింది. 20రోజులు గడుస్తున్నా ఇంత వరకు పోస్టింగ్స్ ఊసెత్తడంలేదు. పోస్టింగ్స్ కల్పించే విషయంలో జెన్కో సీఎండీ సహా, డైరెక్టర్ల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. వారి నిర్లక్ష్యంతోనే పోస్టింగ్స్ నిలిచిపోయాయి.
ప్రతిష్టాత్మక యాదాద్రి పవర్ ప్లాంట్‌లో(వైటీపీఎస్) ఇంజినీర్ల కొరత సమస్య వేధిస్తున్నది. అయినా అధికారులకు పట్టకపోవడం గమనార్హం. తాజాగా పదోన్నతులు పొందిన 203 మందిలో 100 మంది ఏడీఈలను యాదాద్రి పవర్ప్లాంట్కే కేటాయించాల్సి ఉంది. ఒక వైపు సమస్యలు వెన్నాడుతున్నా ఈ ప్లాంట్‌కు ఏడీఈలను కేటాయించడంలేదు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కల్పించుకుని తమకు పోస్టింగ్స్ ఇప్పించాలని పోస్టింగ్స్ పొందిన ఏడీఈలు విజ్ఞప్తిచేస్తున్నారు.