హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 27(నమస్తే తెలంగాణ): మూసీ రివర్బెడ్పై సర్వేకు వచ్చిన అధికారులకు స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. దీంతో పోలీసు భద్రతతో అధికారులు సర్వే చేస్తున్నారు. ఈ సమయంలో ఆందోళన చేస్తున్న స్థానికులను పోలీసులు బెదిరిస్తున్నారు. బలవంతంగా పక్కకు తీసుకెళ్లి .. మీరు పక్కకు తప్పుకోకపోతే అరెస్టులు తప్పవు.. కేసులుంటాయి… జైళ్లలో పడేస్తం.. కోర్టుల చుట్టూ తిరగాలి.. అంటూ బెదిరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఎవరైతే స్థానిక ఆందోళనకు నాయకత్వం వహిస్తున్నారో వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా బెదిరింపులు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వంతో పెట్టుకుంటే లోపలికి పోవాలంటున్న అధికారులకు ప్రజలే గట్టిగా సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తున్నా.. పోలీసుల జులుం ముందు అది పనిచేయడం లేదు. తమ ప్రశ్నలకు సమాధానాలివ్వాలని రెవెన్యూ, మున్సిపల్ అధికారులను స్థానికులు అడుగుతుంటే అడుగడుగునా పోలీసులే అడ్డుపడుతున్నారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదని.. ఇపుడు అంతా పోలీస్ రాజ్యమేనని వారు మండిపడుతున్నారు.